నిన్నకాక మొన్నొచ్చిన హీరోయిన్లు కూడా చక్కగా తెలుగులో మాట్లాడేస్తున్నారు. రష్మిక అయితే సినీ వేడుకల్లో కోరి తెలుగులో మాట్లాడుతుంది. కానీ దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో ఉన్న కాజల్ మాత్రం ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోందంట. త్వరలోనే స్పష్టంగా తెలుగు మాట్లాడతానని చెబుతోంది.
దాదాపు 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. కానీ ఆమె ఇప్పటివరకు తెలుగు సరిగ్గా మాట్లాడలేదు. ఇందులో తప్పులేదు, తెలుగు నేర్చుకోవాలా వద్దా అనేది వాళ్లిష్టం. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం.
కానీ మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఇలా తెలుగు నేర్చుకుంటానని చెప్పడం మాత్రం బాగాలేదు. తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే, ఈ 16-17 ఏళ్లలో కాజల్ ఎప్పుడో ఆ పని చేసి ఉండేది, ఎంచక్కా ఈ పాటికి తెలుగులో మాట్లాడేది. కానీ ఆమెకు ఆ ఉద్దేశం లేదు, అలాంటప్పుడు ఎందుకీ ప్రకటనలు? ఎవర్ని మెప్పించడానికి ఈ స్టేట్ మెంట్స్?
మొన్నటికిమొన్న గంగం గణేశ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైంది రష్మిక. చక్కగా తెలుగులో మాట్లాడింది. ఇంగ్లిష్ లో మాట్లాడితే మాలాంటి ఉత్తరాది వాళ్లకు కూడా అర్థమౌతుంది కదా అంటూ ఓ నెటిజన్ ఆమెను సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం అందరికీ నచ్చింది. ఏ ప్రాంతంలో ఉంటే ఆ భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తానని, అలా చేయడం వల్ల మనసుకు దగ్గరగా ఉన్న భావన ఆడియన్స్ తో పాటు, తనకు కూడా కలుగుతుందని వెల్లడించింది.
రష్మిక అలాంటి ఆలోచనలతో ఉంది కాబట్టి వెంటనే తెలుగు నేర్చుకుంది. నార్త్ నుంచి వచ్చిన రకుల్, తమన్నా లాంటి వాళ్లు కూడా చక్కగా తెలుగులో మాట్లాడతారు. కానీ కాజల్ మాత్రం ‘తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా” అంటూ ఇంకా అవే స్టేట్ మెంట్స్ చెబుతోంది. నెక్ట్స్ సినిమా ప్రచారంలోనైనా ఆమె తన స్టేట్ మెంట్ మారిస్తే బెటర్. ఈ విషయంలో ఆమె బుకాయించాల్సిన అవసరం లేదు.