మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి బయల్దేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి నెలలో అరెస్ట్ చేసింది. 50 రోజుల పాటు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. జైలుపాలైనా సీఎం పదవికి ఆయన రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఢిల్లీలో చివరి విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఆయనకు మే 10 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ గడువు పొడిగింపు కోసం న్యాయ పోరాటం చేసినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. దీంతో ఆయన లొంగిపోయేందుకు తీహార్ జైలుకు బయల్దేరారు.
మార్గమధ్యంలో రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. తాను మళ్లీ జైలుకు వెళ్లొద్దనుకుంటే ఇండియా కూటమిని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వినతి ఏ మేరకు పని చేసిందో ఫలితాల్లో తేలనుంది. ఇదిలా వుండగా కేజ్రీవాల్‌కు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టుకు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తారని పేర్కొన్నారు. కేజ్రీ ఎవరికీ భయపడరని స్పష్టం చేశారు.