కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎంతకైనా బరి తెగించొచ్చని వైసీపీ భావిస్తోందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. అందుకే కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా వుండాలని పదేపదే తన పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు వైసీపీ కీలక నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు తమ భవిష్యత్‌ను దిశానిర్దేశం చేసేవిగా టీడీపీ, వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవడంపై ఇరు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఎన్నికల్లో కీలక వ్యవస్థల్ని మేనేజ్ చేసుకున్నామని, అలాగే కౌంటింగ్ కేంద్రంలో కూడా అదే హవాను కొనసాగిస్తామని టీడీపీ ధీమాగా వుంది. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా తరగతుల్లో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
వ్యవస్థల్ని మేనేజ్ చేసే విద్యలో చంద్రబాబునాయుడు పీహెచ్‌డీ చేశారని వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడన్నారు. కౌంటింగ్‌లో అవసరమైతే ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ప్రతి ఏజెంట్ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఓటును రాబట్టుకోవాలని సూచించారు.
ఏదైనా అనుమానం వుంటే అధికారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యర్థులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారన్నారు. కానీ సంయమనం కోల్పోవద్దని ఆయన సూచించారు. ప్రత్యర్థులు కుట్రలతో వైసీపీ ఏజెంట్ల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తారని, అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.