ఇటీవల కాలంలో కొంత మంది రాజకీయ నాయకులకు ప్రచార పిచ్చి బాగా పెరిగింది. తాము పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నామనే స్పృహ నాయకుల్లో కొరవడింది. ఏం మాట్లాడితే మీడియాలో బాగా ప్రచారం వస్తుంది, అలాగే తమ నాయకుల మెప్పు పొందుతామనే యావ తప్ప, మరో ఆలోచనే లేకుండా పోతోంది. ఇప్పుడు వీళ్లే నాయకులుగా చెలామణి అవుతున్నారు.
ఈ విషయంలో టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఇటీవల బాగా ఆరితేరారనే పేరు తెచ్చుకున్నారు. ఒక రోజు చంద్రబాబునాయుడి కోసమంటూ రక్తాక్షరాలతో ప్రచారం పొందారు. ఇటీవల నారా లోకేశ్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలనే డిమాండ్‌తో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ డిమాండ్‌తో లోకేశ్ గుడ్ లుక్స్‌లో పడడం, ఆ తర్వాత టీడీపీ అనుకూల చానళ్లలో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు.
తాజాగా ఎగ్జిగ్ పోల్స్‌పై ఆయన సంచలన కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు. వైసీపీదే అధికారం అని ఆరా మస్తాన్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. దీంతో ఆయనపై టీడీపీ నాయకులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న ఒక అడుగు ముందుకేసి, మీడియాను తన వైపు తిప్పుకున్నారు.
ఆరా మస్తాన్ ప్రకటించినట్టుగా వైసీపీదే అధికారం అని ఎగ్జాట్ పోల్స్ తేల్చితే… నాలుక కోసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తప్పని తేలితే, ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటారా? అని ఆయన సవాల్ విసిరారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు మస్తాన్ క్షమాపణ చెప్పాలని బుద్ధా డిమాండ్ చేయడం గమనార్హం. అదేంటో గానీ, మస్తాన్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. ఆ సంస్థల ప్రతినిధులెవర్నీ అడగని బుద్ధా… కేవలం ఆరా మస్తాన్‌కు మాత్రమే సవాల్ విసరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సవాల్ విసిరింది బుద్ధానే కాబట్టి, కనీసం మాట మీద తానైనా నిలబడతారా? లేదా? అనేది స్పష్టం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.