'హిట్ సినిమాల్ని అమెజాన్ ప్రైమ్ లో పెట్టినప్పుడు కొన్ని రోజుల పాటు రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ కు పెట్టడం మనకు తెలిసిందే. 99 రూపాయల నుంచి 199 రూపాయల వరకు సినిమాను బట్టి రెంట్ పెడతారు. ఆ మొత్తాన్ని చెల్లించి సినిమాను ప్రైమ్ లో చూడొచ్చు.
దీనిపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. తెలుగులో అంతగా ఆదరణ పొందని పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాల్ని అద్దె ప్రాతిపదికన పెట్టి చేతులు కాల్చుకుంది ప్రైమ్ వీడియోస్ సంస్థ. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు వ్యవహరిస్తోంది.
కాజల్ లీడ్ రోల్ పోషించిన సినిమా కరుంగాపియం. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇలాంటి ఫ్లాప్ సినిమాను స్ట్రీమింగ్ కు పెడుతూ, దానికి కూడా అద్దె ఫిక్స్ చేసింది సదరు సంస్థ. 99 రూపాయలు చెల్లించి ఈ సినిమాను చూడాల్సి వస్తుంది.
దీనిపై తమిళ నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమాను కూడా నేరుగా స్ట్రీమింగ్ కు పెట్టకుండా, ఇలా రెంట్ ఫిక్స్ చేయడం దారుణమంటున్నారు చాలామంది. ఇలాంటి పనులు చేయడం వల్లనే పైరసీని ప్రోత్సహించాల్సి వస్తోందంటూ మరికొంతమంది పోస్టులు పెట్టారు.