ఆర్వో అతి తెలివి.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ ఆగ్ర‌హం!

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల హ‌క్కుల్ని కాల‌రాస్తూ, అలాగే అధికార‌, లేదా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కొమ్ము కాస్తూ ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హానికి కొంద‌రు అధికారులు గురి అవుతున్నారు. దీంతో కొన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌పై…

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల హ‌క్కుల్ని కాల‌రాస్తూ, అలాగే అధికార‌, లేదా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కొమ్ము కాస్తూ ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హానికి కొంద‌రు అధికారులు గురి అవుతున్నారు. దీంతో కొన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌పై కూడా ఈసీ వేటు వేసింది. ఇటీవ‌ల ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఎర్ర‌గొండ‌పాళెం ఆర్వో శ్రీ‌లేఖ చౌద‌రి టీడీపీ అభ్య‌ర్థి కంటే ఎక్కువ‌గా పార్టీ కోసం ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. దీంతో ఆమెను ఆర్వోగా త‌ప్పించింది.

అలాగే ఇవాళ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కారంపూడి సీఐ నారాయ‌ణ‌స్వామి చౌద‌రిపై కూడా ఈసీ వేటు వేసింది. ఈ అధికారి ప‌క్ష‌పాత వైఖ‌రి వ‌ల్లే మాచ‌ర్ల‌లో పెద్ద ఎత్తున గొడ‌వ‌లు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ వుంది. అధికారులు అల‌స‌త్వం, ప‌క్ష‌పాత వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తే… వేటు ప‌డుతుంద‌ని తెలిసినా కొంద‌రు మాత్రం త‌మ తీరు మార్చుకోవ‌డం లేదు.

అలాంటి వారిలో తిరుప‌తి అసెంబ్లీ ఎన్నిక‌ల అధికారి అదితిసింగ్ వైఖ‌రిపై ముఖ్యంగా కూట‌మి నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుప‌తిలో ఎలాగైనా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు, వారి త‌ర‌పున ఏజెంట్ల‌ను కౌంటింగ్ హాల్లోకి అడుగు పెట్ట‌నివ్వొద్ద‌ని ఆమె కంక‌ణం క‌ట్టుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె అధికార పార్టీకి కొంత వ‌ర‌కు ఒత్తాసు ప‌లక‌డంతో పాటు జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ నాయ‌కుల‌ను అడ్డుకునే కుట్ర‌ల‌కు తెర‌లేప‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇటీవ‌ల స్వ‌తంత్ర అభ్య‌ర్థులతో పాటు వారి త‌ర‌పు ఏజెంట్ల‌ను కౌంటింగ్‌కు అనుమ‌తించ‌కూడ‌ద‌ని ఆర్వో అదితి సింగ్ నిర్ణ‌యంపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె త‌న పంతాన్ని నెగ్గించుకోడానికి రూట్ మార్చిన‌ట్టు స‌మాచారం. పోలీసుల భుజాల‌పై ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల హ‌క్కుల్ని కాల‌రాయ‌డానికి వ్యూహ ర‌చన చేసిన‌ట్టు కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు.

త‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల త‌ర‌పున ఏజెంట్ల‌కు పాస్‌ల‌ను ఆమె మంజూరు చేశారామె. అయితే అస‌లు ట్విస్ట్ ఇక్క‌డే వుంది. ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు… ఫ‌లానా పార్టీకి అనుబంధం పేరుతో కౌంటింగ్ హాల్లోకి సంబంధిత ఏజెంట్ల‌ను అనుమ‌తించొద్ద‌ని అన‌ధికారికంగా పోలీసుల‌కు ఆమె ఆదేశాలు ఇచ్చిన‌ట్టు కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆర్వో ఎవ‌రి ఒత్తిళ్ల మేర‌కు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని, ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే మాత్రం… ప‌ద్మావ‌తి యూనివ‌ర్సిటీ ఎదురుగా కౌంటింగ్ రోజు భారీ స్థాయిలో ధ‌ర్నా చేయాల్సి వ‌స్తుంద‌ని ప‌లువురు ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు హెచ్చ‌రిస్తున్నారు.

అభ్య‌ర్థుల‌కు త‌గిన ఏర్పాట్లు చేయ‌డ‌మే ఆర్వో బాధ్య‌త అని, అడ్డంకులు సృష్టించ‌డం కాద‌ని అదితి సింగ్ తెలుసుకుంటే మంచిద‌ని స్వ‌తంత్ర అభ్య‌ర్థులు హెచ్చ‌రిస్తున్నారు. ఒక‌వైపు త‌మ‌కు పాసులివ్వ‌డం ద్వారా చేతికి మ‌ట్టి అంట‌కుండా చేస‌కుని, పోలీసుల్ని బ‌లి ప‌శువులు చేసేలా ఆమె ప్లాన్ చేశార‌ని తిరుప‌తి స్వ‌తంత్ర అభ్య‌ర్థులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తిరుప‌తి ఆర్వో వ్య‌వ‌హారంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని స్వ‌తంత్ర అభ్య‌ర్థులు హెచ్చ‌రిస్తున్నారు.