బ‌హిష్క‌రించాల‌ని ఈసీ చెప్పిందాః టీడీపీ అభ్య‌ర్థి ఫైర్‌!

ఈ నెల నాల్గో తేదీ కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ జిల్లాలో కొంద‌రిపై పోలీసులు జిల్లా బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. సుమారు 30 మందికి పైగా ఇలా జిల్లా నుంచి వెళ్లిపోవాల‌ని పోలీస్ అధికారులు…

ఈ నెల నాల్గో తేదీ కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ జిల్లాలో కొంద‌రిపై పోలీసులు జిల్లా బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. సుమారు 30 మందికి పైగా ఇలా జిల్లా నుంచి వెళ్లిపోవాల‌ని పోలీస్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల‌పై ప్రొద్దుటూరు టీడీపీ అభ్య‌ర్థి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. 

ప్రొద్దుటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఊళ్లు వ‌దిలి వెళ్లాల‌ని కొంద‌రికి పోలీసులు నోటిసులు ఇస్తున్నార‌న్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌పై జిల్లా బ‌హిష్క‌ర‌ణ వేటు వేయాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు ఇచ్చిందా? అని ఆయ‌న పోలీసు అధికారుల్ని ప్ర‌శ్నించారు. ఇలా ఎక్క‌డైనా వుంటుందా? అని ఆయ‌న మండిప‌డ్డారు. 

సొంతూళ్ల‌ను వ‌దిలి ఎక్క‌డికి వెళ్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు, ఎక్క‌డ త‌లదాచుకుంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బంధువులు, స్నేహితులు ఉన్న‌ప్ప‌టికీ, బ‌హిష్క‌ర‌ణ వేటుకు గురైన వారికి ఆశ్ర‌యం ఎలా ఇస్తార‌ని వ‌రద‌రాజుల‌రెడ్డి ప్ర‌శ్నించారు. స్థానికేత‌రుల‌ను పోలీసులు అనుమ‌తించ‌డం లేద‌ని, అలాంట‌ప్పుడు బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వాళ్ల‌ను ఇత‌ర ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ప్ర‌శ్నించారు. 

సాధార‌ణంగా ఎన్నిక‌లు, కౌంటింగ్ స‌మ‌యాల్లో అన్ని పార్టీల నాయ‌కుల‌ను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తుంటార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. గొడ‌వ‌ల‌కు పాల్ప‌డితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని పోలీసులు హెచ్చ‌రించ‌డం స‌ర్వ సాధార‌ణ విష‌యంగా ఆయ‌న చెప్పారు. అలా చేయ‌కుండా ఏకంగా ఊళ్లు వ‌దిలి వెళ్లాల‌ని నోటీసులు ఇవ్వ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ విష‌య‌మై క‌డ‌ప ఎస్పీ, డీఐజీతో మాట్లాడ్తాన‌ని ఆయ‌న అన్నారు.