విజయనగరం జిల్లా బొబ్బిలి సీటులోనే ఒక గంభీరత్వం పౌరుషం కనిపిస్తాయి. వందల ఏళ్ల క్రితం సంస్థానాలు రాజులు ఏలిన ప్రాంతం ఇది. అటువంటి బొబ్బిలిలో ప్రతీ సారీ ఎన్నికలు ఒక యుద్ధాన్నే తలపిస్తాయి. ఈసారి మాత్రం బొబ్బిలి యుద్ధాన్ని గుర్తుకు తెచ్చాయని అంటున్నారు.
మొదటి సారి బొబ్బిలి యువరాజు బేబీ నాయన పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల రాజకీయం కొత్త అయినా తన అన్న మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు గెలుపు కోసం తెర వెనక దశాబ్దాలుగా పనిచేసిన అనుభవం ఉంది. దాంతోనే ఆయన టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు.
ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్ధి శంబంగి చిన అప్పలనాయుడుది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. ఇప్పటికి నలభై ఒక్క ఏళ్ళ క్రితం ఆయన మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. బొబ్బిలిలో టీడీపీ గెలిచిందే మూడు సార్లు. ఆ మూడు సార్లూ శంబంగి అప్పలనాయుడే టీడీపీకి ఆ విజయం అందించారు.
ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరి 2019లో నాలుగో సారి విజయం సాధించారు. ఇపుడు ఆయన ఏడు పదుల వయసులో వైసీపీ నుంచి మరోసారి గెలిచి అయిదు సార్లు నెగ్గిన ఎమ్మెల్యేగా జెండా పాతుతాను అంటున్నారు. ఆయన సగటు ప్రజానీకం ప్రతినిధిగా పోటీలో ఉన్నారు.
పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అని ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు. తనను ఎన్నుకుంటే జనంలోనే అందుబాటులో ఉంటాను అని హామీ ఇచ్చారు. ఈసారి బొబ్బిలి రాజులు కూడా జనంలోకి వచ్చి వారితో మమేకం అయ్యారు. పోలింగ్ తీరు చూస్తే చాలా భీకరంగా పోరు సాగింది అని అంటున్నారు.
పోలింగ్ అనంతరం వస్తున్న అంచనాలు చూస్తే చాలా మటుకు టైట్ ఫైట్ అని చెబుతున్నాయి. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ అంటున్నాయి. టీడీపీ అయితే 1994లో గెలిచిన తరువాత మళ్లీ గెలిచింది లేదు. ఈ సీటులో కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ అప్పట్లో ఉండేది. అది వైసీపీ వైపు మళ్ళింది.
అందుకే 2014, 2019లలో ఘన విజయాలను ఫ్యాన్ పార్టీ సాధించింది. ఈసారి కూడా సెంటిమెంట్ ప్రకారం వైసీపీయే గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీకి లాంగ్ గ్యాప్ తరువాత సక్సెస్ రుచి చూపిస్తామని బొబ్బిలి రాజులు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో బొబ్బిలి మొగ్గు ఎటు వైపో కొంత వరకూ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.