నిండు సభలో, వేదికపై హీరోయిన్ అంజలిపై బాలకృష్ణ చేయిచేసుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే కాస్త మద్యం పుచ్చుకున్నట్టు కనిపించిన బాలయ్య, వేదికపైకి ఎక్కి ఏకంగా అంజలిని వెనక్కి నెట్టబోయారు. తమాయించుకున్న అంజలి, ఆ వెంటనే ఫక్కున నవ్వేసింది.
ఈ ఘటనను చాలామంది ఖండించారు. బాధితురాలు అంజలి మాత్రం ఆలస్యంగా స్పందించింది. జరిగిన ఘటనను ఆమె తేలిగ్గా తీసుకుంది. “బాలకృష్ణ, నేను ఒకరి పట్ల ఒకరం పరస్పరం గౌరవాన్ని కలిగి ఉన్నాం. మేం చాలా కాలం నుంచి మంచి స్నేహబంధాన్ని పంచుకుంటున్నాం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది.” అంటూ స్పందించింది.
ఈ సందర్భంగా ఆమె వీడియో కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో బాలయ్య, ఆమెను వెనక్కు తోసే క్లిప్ కూడా ఉంది. అంజలి రెస్పాన్స్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలయ్యపై ఇప్పటికే ఎన్నో విమర్శలు, తిట్లు పడ్డాయని, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇంత ఆలస్యంగా స్పందించడంలో అర్థం ఏంటంటూ ఆమెపై కొంతమంది విరుచుకుపడుతున్నారు.
అంజలితో బలవంతంగా ఈ ట్వీట్ పెట్టించినట్టుందని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు ఆమెపై జాలి చూపించారు. వ్యవస్థను వ్యతిరేకించడం అంజలి ఒక్కదాని వల్ల కాదని, మనసులో బాధ ఉన్నప్పటికీ, అంజలి ఏమీ చేయలేకపోతోందని సానుభూతి చూపించారు.
అంజలి మాత్రం తన స్టేట్ మెంట్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు బాలయ్య విషయంలో ఇలాంటివన్నీ కామన్. ఆయన అస్సలు పట్టించుకోడు.