దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్య పరిస్థితిపై 2 రోజుల కిందట గ్రేట్ ఆంధ్ర ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యానికి గురయ్యారనే అనుమానాల్ని వ్యక్తం చేయగా.. ఆయన సోదరుడు వాటిని ఖండించాడు. ఈరోజు నేరుగా వీవీ వినాయక్ వీడియో రిలీజ్ చేశారు.
తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించడానికి వినాయక్ ఈ వీడియో విడుదల చేయలేదు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనతో పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. కృష్ణ సినిమాకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశానని మాత్రమే ఆయన చెప్పారు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయారు.
తను బాగున్నానని చెప్పడమే వినాయక్ లక్ష్యం. అందుకే ఈ వీడియో రిలీజ్ చేశారనే విషయం అర్థమౌతూనే ఉంది. అయితే ఆయన నీరసంగా ఉన్నారనే విషయాన్ని ఆయన మాట తీరే చెబుతోంది. అంతేకాదు, ఆయన బాగా చిక్కిపోయారనే విషయం కూడా వీడియో చూస్తే అర్థమౌతోంది. ఒకప్పటి బూరెబుగ్గలు కనిపించడం లేదు. కళ్లజోడు ఎందుకు పెట్టారో ఆయనకే తెలియాలి.
మొత్తమ్మీద తన ఆరోగ్య స్థితిపై వస్తున్న పుకార్లను వినాయక్ ఈ వీడియో ద్వారా పరోక్షంగా ఖండించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, ఎప్పట్లానే చలాకీగా తన ఆఫీస్ కు రావాలని కోరుకుందాం.