ప్రేక్షకులే దేవుళ్లు.. వాళ్లకు నచ్చితేనే సినిమా హిట్టవుతుంది.. మేం ఏం చేసినా ప్రేక్షకుల్ని ప్రసన్నం చేసుకునేందుకే.. ఇలాంటి కబుర్లు చాలానే విన్నాం. ఇంకా వింటూనే ఉన్నాం. కానీ ఆ ప్రేక్షకుడి కోసం ఓ రోజు పెడితే, టాలీవుడ్ నుంచి సహకారం సున్నా.
అవును.. ఈరోజును సినీ ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఒక్క రోజు కొన్ని సినిమాల్ని 99 రూపాయలకే వీక్షించొచ్చని, దేశవ్యాప్తంగా 4వేలకు పైగా స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. దీంతో చాలామంది ఆశపడ్డారు. తమ జేబుకు చిల్లు పడకుండా సినిమా ఎంజాయ్ చేయొచ్చని భావించారు.
కట్ చేస్తే, ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 99 రూపాయలకు అందుబాటులో లేదు. పీవీఆర్, ఏషియన్, సినీపొలిస్, మిరాజ్ లాంటి ప్రముఖ మల్టీప్లెక్స్ ఛెయిన్స్ లో ఈ ఒక్క రోజు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గొప్పగా ప్రకటించారు. కానీ ఈ రోజు రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గం గం గణేశ సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు 99 రూపాయల టికెట్ లేదు. ఎప్పట్లానే టికెట్ రేట్లు ఉన్నాయి.
బాధాకరమైన విషయం ఏంటంటే, గతవారం రిలీజై ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా టికెట్ రేట్లు తగ్గించలేదు. ఇది సినీ ప్రేమికులపై టాలీవుడ్ మేకర్స్ కు, మల్టీప్లెక్సు యాజమాన్యాలకు ఉన్న ప్రేమ.
అటు ఉత్తరాదిన మాత్రం ఈ కార్యక్రమం దిగ్విజయంగా మొదలైంది. ఈరోజు, గతవారం రిలీజైన సినిమాలతో పాటు.. కొన్ని హాలీవుడ్ మూవీస్ ను కేవలం 99 రూపాయలకే థియేటర్లలో ఎంజాయ్ చేసే సౌలభ్యం కల్పించారు. వీటిలో జాన్వి కపూర్ మూవీ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ భాగ్యానికి నోచుకోలేదు.