అందరూ విశాఖలో దిగిపోతున్నారు!

విశాఖకు రద్దీ అనూహ్యంగా పెరిగింది. అది రాజకీయ రద్దీ. విశాఖ వచ్చి మీడియాను అడ్రస్ చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. విశాఖ మీద అధికార పార్టీ ఫోకస్ పెట్టడం ఒక కారణంగా ఉంటే…

విశాఖకు రద్దీ అనూహ్యంగా పెరిగింది. అది రాజకీయ రద్దీ. విశాఖ వచ్చి మీడియాను అడ్రస్ చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. విశాఖ మీద అధికార పార్టీ ఫోకస్ పెట్టడం ఒక కారణంగా ఉంటే విశాఖ నుంచే జూన్ 9న సీఎం గా ప్రమాణం చేస్తాను అని జగన్ చెప్పడం ఇంకో కారణం.

విశాఖకు విపక్ష నేతలు వస్తున్నారు. విశాఖలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో చూస్తే పోలింగ్ ముగిసింది. రిజల్ట్ రావాల్సి ఉంది. ఈ రాజకీయ ఆరోపణలు వల్ల ఓట్లు పడేది లేదు, అధికారం ఎవరికి ఇవ్వాలో జనాలు డిసైడ్ అయి ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం చేసి ఉంచారు. దానికి జూన్ 4న తెరచి చూసుకుంటే ఎవరి జాతాకాలు ఏమిటి అన్నది కడిగిన అద్దంలో కనిపించే ముఖంగా తెలిసిపోతాయి.

ఇవన్నీ తెలిసి కూడా విశాఖలో భూకబ్జాలు అంటూ ఎందుకు నేతలు గొంతు చించుకుంటున్నారు అంటే ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి విశాఖ పర్యటన చేసి వెళ్లారు. ఆ వెంటనే ఒక జనసేన లోకల్ లీడర్ ఆయన మీద భూకబ్జా ఆరోపణలు చేశారు.

ఆ తరువాత దానికి టీడీపీ నేతలు అందుకున్నారు. అంతా విజయవాడ నుంచే మాట్లాడుతూ వచ్చారు. ఇపుడు బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు విశాఖ వచ్చి మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం మీద అధికారుల మీద భూ కబ్జా ఆరోపణలు చేశారు.

ప్రాజెక్టుల పేరులో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని అన్నారు. బెదిరించి తక్కువ ధరకు భూములు సొంతం చేసుకున్నారు డీ పట్టా భూములు లాగేసుకోవడమే కాకుండా అక్రమ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల‌ ద్వారా భూ దోపిడీ చేసేశారు అని విమర్శించారు.

ఈ ఆరోపణలు నిజమే అని కాసేపు అనుకున్నా విశాఖలో వేల ఎకరాల అసైండ్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయని అంటున్నారు. ఉన్నా వాటిని ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం జరిగే పనేనా అని అంటున్నారు. అది ఎపుడు చేసినా వ్యవహారం ఏనాడో గుప్పుమనేది అని అంటున్నారు. తక్కువ రేటుకు భూములు లాక్కుంటే చైతన్యం బాగా పెరిగిన ఊళ్ళలో ప్రతీ వారికీ స్మార్ట్ ఫోన్ ఉన్న కాలంలో సోషల్ మీడియా యుగంలో ఆ విషయం బయటకు పొక్కకుండా ఉంటుందా అని కూడా డౌట్లు వ్యక్తం చేసే వారూ ఉన్నారు.

ఉన్నట్లుండి ఏమిటీ ఆరోపణలు అంటే. ఒక ఉన్నతాధికారిని సీటు నుంచి కదపడం కోసం అలాగే విశాఖ పేరుని మరోసారి డీ ఫేం చేయడం కోసమే అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయిదేళ్లుగా ఎన్నడూ లేని ఆరోపణలు ఇపుడే వెల్లువలా చేయడం ఒకే తీరున అంతా చేయడం మీద వైసీపీ నేతలు  ఫైర్ అవుతున్నారు.