ఆయనకు అక్కడ లక్కు చిక్కినట్లేనా?

రాజకీయాల్లోకి వచ్చి పదిహేనేళ్ళు అయినా ఎమ్మెల్యే అనిపించుకోలేని బాధతో వైసీపీని వీడి జనసేనలో చేరిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ తన తూర్పుని కాదని పార్టీ ఇచ్చిన దక్షిణను తీసుకున్నారు. నామినేషన్ కి కొద్ది రోజుల…

రాజకీయాల్లోకి వచ్చి పదిహేనేళ్ళు అయినా ఎమ్మెల్యే అనిపించుకోలేని బాధతో వైసీపీని వీడి జనసేనలో చేరిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ తన తూర్పుని కాదని పార్టీ ఇచ్చిన దక్షిణను తీసుకున్నారు. నామినేషన్ కి కొద్ది రోజుల ముందే టికెట్ ఖరారు అయింది.

మొదట్లో జనసేనలో నిరసనలు టీడీపీలో భగభగలూ అన్నీ చూశారు. చివరికి సర్దుబాటులో అంతా కలసి పని చేసారు అని వార్తలు వచ్చాయి. అయినా విశాఖ సౌత్ లో వార్  వన్ సైడ్ కానే కాదు అని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్ కి అయినా జనసేన అభ్యర్ధి వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి అయినా తక్కువ మెజారిటీతోనే గెలుపు సాధ్యమని అంచనాలు చెబుతున్నాయి.

ఈ అంచనాలు ఇలా ఉంటే తాను నలభై నుంచి యాభై వేల ఓట్ల మెజారిటీతో సౌత్ నుంచి గెలుస్తాను అని వంశీ సంచలన ప్రకటన చేశారు. తన గెలుపు ఖాయమని, అది ఒక రికార్డు అవుతుందని ఆయన మీడియాకు చెప్పారు. వంశీకి గెలుపు ధీమా ఎంత ఉన్నా ఇంత మెజారిటీ సాధ్యమా అన్నదే అంతా తర్కించుకుంటున్నారు.

విశాఖ సౌత్ 2009లో ఏర్పడింది. రెండు సార్లు అత్యధిక మెజారిటీలు 18 వేల దాకా వాసుపల్లి గణేష్ కుమార్ కే వచ్చాయి.  దానికి ముందు విశాఖ వన్ గా ఈ సీటు ఉంది. అపుడు కూడా 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి ద్రోణంరాజు సత్యనారాయణకు వచ్చిన పదిహేడు వేల మెజారిటీనే అత్యధికం అని చెప్పుకున్నారు. ఎన్నడూ భారీ మెజారిటీ సౌత్ కానీ దాని పూర్వ రూపం విశాఖ వన్ కానీ చూడలేదు.

అక్కడ పోటా పోటీగానే పోరు సాగుతూ వచ్చింది. అటువంటి హాట్ సీటు లో యాభై వేల మెజారిటీ అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏకపక్షంగా ఒక ప్రభంజనం వీచాలి. మొత్తం రెండు లక్షలకు పైగా ఉన్న ఓట్లలో పోలింగ్ జరిగింది లక్షా యాభై వేల దాకా ఉంటే అందులో యాభై వేల మెజారిటీ అంటే వైసీపీ అభ్యర్ధికి సిట్టింగ్ ఎమ్మెల్యే డకౌట్ అయినట్లేనా అన్నది కూడా చర్చిస్తున్నారు. అలా జరగాడానికి దారి తీసే పరిస్థితులు ఏమీ లేవు.

అయితే గెలుపు కోసం తూర్పు నుంచి సౌత్ కి వచ్చిన వంశీకి ఈ దఫా లక్కు అక్కడ చిక్కుతుందా అంటే అభిమానులు అవును అంటున్నారు. ఈవీఎం ఏమి చెబుతుందో చూడాలి.