దేశంలోనే పవర్ఫుల్ యూట్యూబర్ ఇతనే

అతనేది చెప్పినా సుత్తి లేకుండా సూటిగా చెప్తాడు. Advertisement “నమస్కార్ దోస్తో” అని మొదలుపెట్టి నేరుగా టాపిక్కులోకి వెళ్లిపోతాడు. చెప్పేదంతా తన మాతృభాష హిందీలో. కానీ ఎక్కడా తొట్రుపాటు ఉండదు, అసందిగ్ధత ఉండదు… భాష…

అతనేది చెప్పినా సుత్తి లేకుండా సూటిగా చెప్తాడు.

“నమస్కార్ దోస్తో” అని మొదలుపెట్టి నేరుగా టాపిక్కులోకి వెళ్లిపోతాడు.

చెప్పేదంతా తన మాతృభాష హిందీలో.

కానీ ఎక్కడా తొట్రుపాటు ఉండదు, అసందిగ్ధత ఉండదు… భాష అంతగా రాని వాళ్లు కూడా ఆసక్తిగా చూస్తారు. కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండనే ఉంటాయి. 

అతని వాయిస్ లో బేస్ కావొచ్చు, స్ఫురద్రూపం కావొచ్చు ఇట్టే ఆకట్టుకుంటాడు. 

దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యూట్యూబర్ అతను. 

ట్రావెల్ వ్లాగ్స్ నుంచి రాజకీయ విశ్లేషణల నుంచి చరిత్రపాఠాల వరకూ అన్నీ చెప్పేస్తుంటాడు.

ఇతను ఒకప్పుడు బీజేపీ అభిమాని. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని, మోదీ రావాలని ఆశించినవాడే. కానీ గత పదేళ్ల పాలనలో అతనికి మోదీ నచ్చలేదు. ఈ మధ్యన మోదీ వ్యతిరేక వీడియోలు చేస్తూనే ఉన్నాడు. మోదీని నియంత అంటున్నాడు. 

అలా చాలామంది అంటుంటారు కదా, అందులో పెద్ద గొప్పేముంది అనుకుంటున్నారా? అలా ఎంతమంది అంటున్నా అందరినీ వదిలేసి బీజేపీ నాయకులు సైతం ఇతన్నే వేలెత్తి చూపుతున్నారు.

ఆం ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలివాల్ ఇతనిపై కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉంది.

అల్ జజీరా వంటి అంతర్జాతీయ వార్తా సంస్థ ఈ వ్యక్తి మీద పెద్ద వ్యాసమే రాసింది. 

ఆ రేంజ్ ఇంఫ్లుయన్సర్ అన్నమాట!! 

ఇన్ని చెప్పారు కానీ, అతని పేరు చెప్పలేదేమంటరా?

అతని పేరు ధృవ్ రాఠీ. వయసు కేవలం 29. అతను తన పేరుతో యూట్యూబ్ చానల్ పెట్టింది 2013లో. అప్పుడతను ఇంటర్ పూర్తి చేసి గ్రాడ్యువేషన్లో చేరాడంతే. షూటింగ్, ఎడిటింగ్ ఇలా మొత్తం తానే చేసుకుంటాడు. ఇప్పుడు తనకి రీసెర్చ్ టీం కొంతవరకు ఉన్నా గతంలో మాత్రం పూర్తిగా తన కష్టమే. 

చేయాలనుకున్న పనికి ఎక్కడా బ్రేక్ వేయకుండా, తన ఆసక్తిని ఎక్కడా డైల్యూట్ చేసుకోకుండా పదేళ్లుగా ఆ చానల్ ని నడుపుతూనే ఉన్నాడు.

ఇప్పుడతని సబ్స్క్రైబర్లు 21 మిలియన్లు. అంతర్జాతీయా స్థాయిలో ఉన్నారు ఫాలోవర్స్. 

చేసిన వీడియోలు 619. తెచ్చుకున్న మొత్తం వ్యూవ్స్ 2.8 బిలియన్లు.

ఇది మామూలు విషయం కాదు. అతని సంపాదన కోట్లల్లో ఉంటుంది. 

అంతే కాదు అతను ట్రావెల్ వ్లాగ్ చేయాలని సిద్ధమైతే ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి, 5 స్టార్ హోటల్స్ వరకు అతనికి ఫ్రీగా ఇచ్చే విమాన సంస్థలు, హోటల్స్ ఉన్నాయి. అది కూడా తన ఒక్కడికే కాదు. తన భార్యకు కూడా కలిపి….!

అన్నట్టు హర్యానికి చెందిన ఈ యువకుడు పెళ్లి చేసుకున్నది జూలీ అనే జర్మన్ యువతిని. ఇంటర్ పూర్తయ్యాక చదువుకోసం జర్మనీ వెళ్తే అక్కడ పరిచయమై తర్వాత అతనికి జీవిత భాగస్వామి అయింది. 

ఇంతకీ ధృవ్ రాఠీ ప్రస్తుతం తన చానల్ని జర్మనీ నుంచే నడుపుతున్నాడు. అతను జర్మనీ రెసిడెంట్ కూడా. 

ఇది మాత్రమేకాదు. ధృవ్ రాఠీ కంటెంట్ కి ఫిదా అయిన చాలా సంస్థలున్నాయి. అందుకే డీకోడ్ విత్ ధృవ్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇండియాతో, డిడబ్ల్యూ ట్రావెల్ పేరుతో జర్మన్ సంస్థ అయిన డయుష్వెల్లే తోనూ షోలు హోస్ట్ చేస్తున్నాడు. స్పాటిఫై లో మహాభారత్ విత్ ధృవ్ రాఠీ పేరుతో కూడా ఒక పాడ్ కాస్ట్ కూడా నడుస్తోంది. 

ఒక్కమాటలో చెప్పాలాంటే ఇతనొక ఇండిపెండెంట్ వ్లాగర్, హోస్ట్, యాక్టివిస్ట్, ఇంఫ్లుయన్సర్… అన్నీను! 

29 ఏళ్లకే కోట్ల సంపాదన, అంతర్జాతీయ గుర్తింపులతో పాటూ, కేంద్ర అధికార పార్టీని సైతం వణికించే ఇంఫ్లుయన్సర్ గా మారాడు. 

ఆసక్తి, ఆలోచన, ఆకట్టుకునే శక్తి ఉండాలే కానీ ఎవరి అండ లేకుండా సోలోగా ఎదిగి కోట్లు సంపాదించే అవకాశాలు ఎప్పుడూ ఉంటున్నాయి. 

అతని భావజాలం ఏవిటి, రాజకీయపరమైన ఆలోచనలేవిటి అనేవి పక్కనపెట్టి.. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయొచ్చు అనే దానికి మాత్రం ఇతన్ని దేశయువత మొత్తం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. 

ఇతని వీడియోల్లో సమాచారంతో పాటు కన్విన్స్ చేసే విధానం చాలా బలంగా ఉంటుంది. ప్రతి దానికి సాక్ష్యాలు చూపిస్తాడు. రీసెర్చ్ చేసి పట్టుకొచ్చిన డేటా మన ముందు ఉంచుతాడు. అందుకే నచ్చకపోయినా చాలాసార్లు నమ్మాల్సి వస్తుంది. అందుకే ఇతను పవర్ఫుల్ ఇంఫ్లుయన్సర్. దానివల్లే కేంద్ర బీజేపీ దృష్టిలో పడ్డాడు. 

“నువ్వెవరో నీ మిత్రులనిబట్టి తెలుస్తుంది. నువ్వు ఎంత బలవంతుడివో నీ శత్రువుల్ని బట్టి తెలుస్తుంది” అంటారు. ఆ రకంగా తన ఐడియాలజీతో ఒక కేంద్ర పార్టీనే శత్రువుగా మార్చుకున్న ధృవ్ రాఠీ ఎంత బలవంతుడయ్యాడో వేరే చెప్పక్కర్లేదు. 

– పద్మజ అవిర్నేని