ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతోంది. కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే నెల 4న ఎన్నికల లెక్కింపు జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తరపున ఏజెంట్లను సిద్ధం చేసుకుంటున్నారు. వివరాలను ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు. మరోవైపు ప్రజల నాడి అంతు చిక్కడం లేదు. దీంతో గెలుపోటముల గురించి తెలియక అంతా జుత్తు పీక్కుంటున్నారు.
ఎన్నికల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల్లో గుండె దడ పెరుగుతోంది. ఫలితాలు ఎలా వుంటాయో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో వుంది. ఫలితాలు ఏ మాత్రం అటూఇటూ అయినా.. భవిష్యత్ ఎలా వుంటుందో అనే భయం నాయకుల్ని వెంటాడుతోంది.
ఏపీ రాజకీయాలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దుర్మార్గంగా ఉన్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారనే విషయాన్ని నాయకులు మరిచిపోయారు. పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నారు. అందుకే భవిష్యత్‌పై భయం, ఆందోళన. ఎన్నికల ఫలితాలను బట్టి ఎవరి భవిష్యత్ ఏంటనేది ఎవరికి వారు నిర్ణయించుకోడానికి సిద్ధమవుతున్నారు.
గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయ పరిస్థితిని చూసి వుండరు. గత పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో విపరీత ధోరణుల్ని చూస్తున్నాం. అధికారం అంటే, ప్రత్యర్థుల్ని వెంటాడి, వేటాడమే అనే అవాంఛనీయ కల్చర్ పుట్టుకొచ్చింది. అందుకే రాజకీయాల్లో కనీస మర్యాదలు మంటగలుస్తున్నాయి. చూడకూడని దారుణాలన్నీ భవిష్యత్‌లో ఏపీలో చూడాల్సి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడడమే ఆలస్యం….అవాంఛనీయ ఘటనల్ని చూడొచ్చు.