అధికారంపై వైసీపీ శ్రేణుల్లో భరోసా నింపడానికి ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు తమదే అధికారం అని, దమ్ముంటే పందెం కాయాలని సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తూ 150కి పైగా సీట్లు తమవే అని సంచలన కామెంట్స్ చేశారు.
అధికారంపై వైఎస్ జగన్ చాలా ధీమాగా ఉన్నారని ఆయన్ను కలిసిన వైసీపీ నాయకులు చెబుతున్నారు. తాజాగా వైసీపీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బుధవారం వేర్వేరుగా మాట్లాడుతూ అధికారంపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. సంక్షేమ పాలన అందించిన జగన్ను మరోసారి సీఎం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారన్నారు.
ముఖ్యంగా మహిళలు, సామాజిక భద్రత పింఛన్దారులు జగన్ను మళ్లీ తెచ్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపారన్నారు. వచ్చే నెల నాల్గో తేదీ జరిగే కౌంటింగ్లో వైసీపీ విజయం సాధిస్తుందని, 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రత్యర్థుల ఆటలు సాగనివ్వకుండా అప్రమత్తంగా వుండాలని సజ్జల సూచించారు. జూన్ 9న సీఎం ప్రమాణ స్వీకారం వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు వెళ్లడం లేదన్నారు. వారం తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుందని సజ్జల అన్నారు.
సీఎం జగన్పై ప్రజానీకం ఎంత విశ్వాసంతో ఉన్నారో పోలింగ్ రోజు చూశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారనే నమ్మకాన్ని వైవీ వెల్లడించారు.