కౌంటింగ్ ఏజెంట్లపై తిరుపతి ఆర్వో అదితిసింగ్ వింత నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయంపై తిరుపతిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా పని చేస్తూ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదితిసింగ్ బదిలీ అయ్యారు. ఆమే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
మొదటి నుంచి ఆమె నిర్ణయాలు వివాదాస్పదమే. అందుకే ఆమెకు ముద్దుగా “అతి”దిసింగ్ అని పెట్టారు. ఏదైనా మాట్లాడాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా ఆమె ఫోన్‌కు అందుబాటులో వుండరు. మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఆమెపై వుంది.
తాజాగా కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల అధికారిది కీలక పాత్ర. స్వతంత్ర అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించే ప్రశ్నే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఇదేమని ప్రశ్నించగా 46 ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని కలుపుకుంటే మొత్తం 46 మంది బరిలో నిలిచారని, ఇంత మందికి కౌంటింగ్ ఏజెంట్లు ఉండడానికి తగిన స్థలం లేదని ఆమె సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
స్థలం సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవడం ఎన్నికల సంఘం బాధ్యత అని, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునే హక్కుని ఆర్వో ఎలా కాలరాస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని మినహాయిస్తే, మిగిలిన అభ్యర్థుల తరపున ఏజెంట్లను అనధికారికంగా అనుమతించకూడదని అదితిసింగ్ నిర్ణయించడంపై మండిపడుతున్నారు.
అదితిసింగ్ అతి చేస్తున్నారని, ఇలా రాష్ట్రంలో ఎక్కడా ఏ ఎన్నికల అధికారి వ్యవహరిస్తుండరనే చర్చకు తెరలేచింది. ఇదిలా వుండగా తమ తరపున తప్పకుండా ఏజెంట్లను అనుమతించాలని కోరుతూ ఆర్వోకు స్వతంత్ర అభ్యర్థులు విన్నవించుకోవడం గమనార్హం. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ఆర్వో అదితిసింగ్… ఆమే సమస్యగా మారడం దౌర్భాగ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.