చిన్న పిల్లల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. పిల్లల్ని అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. 11 మందిని అరెస్ట్ చేశారు, 16 మంది పిల్లల్ని గుర్తించారు.
చెప్పుకోడానికి ఇది ఓ వార్త మాత్రమే. కానీ దీని వెనక ఓ పెద్ద కన్నీటి గాధ ఉంది. తల్లి ప్రేమ దాగుంది. తల్లి ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా అనే పెద్ద చర్చకు దారి తీసింది ఈ ఉదంతం.
హైదరాబాద్ కు చెందిన ఓ జంటకు పెళ్లయి పదేళ్లయింది. పిల్లలు పుట్టరని నిర్ధారణకు వచ్చిన వాళ్లు ఓ చిన్నారిని అక్రమంగా కొనుగోలు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తమ భవిష్యత్తును ఆ చిన్నారిలో చూసుకుంటున్నారు. అంతలోనే ఆ చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంజారాహిల్స్ కు చెందిన దంపతులకు 15 ఏళ్లుగా పిల్లలు లేరు. 3 రోజుల వయసున్న పాపను అక్రమంగా కొనుగోలు చేశారు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు పాప వయసు ఏడాదిన్నర. ఇప్పుడిప్పుడే అమ్మా అంటోంది. ఆ చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకొని శిశు విహార్ కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జంటకు కూడా పిల్లలు లేరు. వీళ్లు కూడా అక్రమంగా ఓ పాపను కొనుగోలు చేశారు. పాపే లోకంగా బతుకుతున్నారు. నల్గొండకు చెందిన ఓ మహిళకు సంతానం లేదు. ఆమె ఓ బిడ్డను అక్రమంగా కొనుగోలు చేసింది. కొన్నాళ్లకు భర్త చనిపోయాడు. బిడ్డ సర్వస్వం అనుకుంది. ఇప్పుడు ఆ బిడ్డను పోలీసులు శిశువిహార్ లో చేర్చారు. ఇక తనెందుకు జీవించాలని ప్రశ్నిస్తోంది ఆ మహిళ.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కన్నీటి గాధలు, పిల్లల్ని దూరం చేసుకున్న ఆ పెంపుడు తల్లిదండ్రుల ఏడుపులు గుండెల్ని పిండేస్తున్నాయి. పిల్లల్ని అక్రమంగా కొనుగోలు చేసిన వాళ్లలో 16 మంది తెలంగాణ వాసులు కాగా, 9 మంది ఏపీ వాసులున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పిల్లల్లో ఎక్కువమంది ఆడపిల్లలే ఉండడం గమనార్హం.
పిల్లల్ని కని పెంచలేక అమ్ముకున్న అభాగ్యులు ఎంతోమంది. ఆడ బిడ్డ పుట్టిందని కోపంతో వదిలించుకున్న నీచులు కొంతమంది. ఎంతోమంది తల్లులకు కడుపు కోత మిగిలిస్తూ, కిడ్నాప్ కు గురైన చిన్నారులు మరికొంతమంది. అక్రమంగా పుట్టిందని చెత్త కుప్పలో వదిలేసిన దుర్మార్గులు మరికొంతమంది. ఇలాంటి పిల్లలంతా అక్రమంగా అమ్ముడుపోయారు. లక్ష నుంచి 6 లక్షల రూపాయలకు వీళ్లను పిల్లల్లేని తల్లిదండ్రులు కొంతమంది కొనుగోలు చేశారు.
ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు పోలీసులకు అప్పగిస్తారా? అప్పటికే పెంపుడు తల్లిదండ్రులతో అనుబంధం ఏర్పరుచుకున్న ఈ చిన్నారులు, కన్న తల్లిదండ్రుల వద్ద ఉండగలరా? అసలు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెనక్కు తీసుకుంటారు? పిల్లల్ని ఇన్నాళ్లూ పెంచిన పెంపుడు తల్లిదండ్రుల కడుపుకోతను తీర్చేదెవరు?
అక్రమంగా శిశువును కొనుగోలు చేయడం నేరమే.. కానీ తల్లీబిడ్డ మధ్య గాఢంగా అనుబంధం పెనవేసుకున్న తర్వాత ఇలా విడదీయడం ఎంత వరకు సమంజసం?