ఫస్ట్ లుక్.. ఫస్ట్ లుక్కే. అందుకే ఆ లుక్కుతోనే జనాలను ఆకట్టుకోవాలని చూస్తారు మేకర్లు. నిన్నటికి నిన్న మధ్యాహ్నం వదిలారు బచ్చలమల్లి అనే సినిమా ఫస్ట్ లుక్. అల్లరి నరేష్ హీరో. సుబ్బు దర్శకుడు. సాయంత్రానికి ఆంధ్ర, నైజాం ఏరియాలు అమ్మకాలు జరిగిపోయాయి. ఎంతకు అమ్మారు, ఎవరికి అమ్మారు అన్న సంగతి అలా వుంచితే, చిన్న, మీడియం సినిమాల మార్కెటింగ్ కష్టంగా వున్న రోజుల్లో ఇలా ఆసక్తి చూపి కొనడానికి ముందుకు రావడం అంటే లక్కే కదా.
అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా ఆ ఒక్కటీ అడక్కు కు క్రిటిక్ అప్లాజ్ పెద్దగా రాకపోయినా, ఆ వారంలో విడుదలైన అన్ని సినిమాల కన్నా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. నైజాంలో కూడా బాగానే ఫెర్ ఫార్మ్ చేసింది. అల్లరి నరేష్ చేసిన గత మూడు సినిమాలు చూసుకుంటే ఆంధ్ర, నైజాంలో అతగాడికి ఓ మాదిరి మార్కెట్ వుందని అర్థం అయింది. అందుకే బచ్చలమల్లి మీద బయ్యర్లు రుమాలు వేసేసారు.
నైజాంను ఆసియన్ సినిమాస్ కోటి ఇరవై ఆరు లక్షలకు ఎన్ ఆర్ ఎ చేయడం విశేషం. ఎందుకంటే ఆ సంస్థ అడ్వాన్స్ ల మీద పంపిణీ చేస్తుంది తప్ప, కొనదు. అలాంటిది ఈ సినిమా ఎన్ ఆర్ ఎ చేసింది. ఇక ఆంధ్ర ఏరియా మొత్తాన్ని రెండున్నర కోట్లకు కాస్త అటు ఇటుగా ఈస్ట్ గోదావరికి చెందిన పంపిణీ దారు తీసుకున్నాడు. ఇక సీడెడ్, ఓవర్ సీస్ మిగిలింది.
ఈ లెక్కన చూసుకుంటే నాలుగు కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ అవుతోంది. నాన్ థియేటర్ ఇప్పటికే 9 కోట్లకు పూర్తయింది. అంటే 13 కోట్లకుపైగా రికవరీ వస్తోంది. కానీ అసలు సంగతి ఏమిటంటే నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడంతో, ఈ సినిమాకు నిర్మాణం, ప్రింట్, పబ్లిసిటీ, వడ్డీలు కలిపి ఆ 13 కోట్ల మేరకు ఖర్చు కావడం. అంటే ఓవర్ ఫ్లోస్ వస్తే లాభాలు లేదంటే అక్కడిక్కడ సరిపోయినట్లు.