వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ వుంటాయని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఈమె వైసీపీ నాయకురాలు కూడా. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు లక్ష్మీపార్వతి ఘన నివాళులర్పించారు.
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయనకు జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి, కల్యాణ్‌రామ్, బాలకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె అన్నారు.
ఏపీలో జగన్ నేతృత్వంలో మంచి పాలన వస్తుందని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఓ శక్తి అన్నారు. ఎన్టీఆర్ చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.