రాష్ట్రంలోగానీ, కేంద్రంలోగానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాత ప్రభుత్వాన్ని మరిపించేలా పాలన చేయాలనుకుంటుంది. తనదైన ముద్ర వేయాలని భావిస్తుంది. గత ప్రభుత్వం నిర్ణయాలను తిరగదోడుతుంది. వాటిని సమూలంగా మారుస్తుంది లేదా మార్పులు చేర్పులు చేస్తుంది. ఇది తప్పు కాదు. అయితే చేసే మార్పులకు సహేతుక కారణాలు ఉండాలి. ప్రజలను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేక మార్పులు చేస్తున్నాడు. తనదైన ముద్రను వేస్తున్నాడు.
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను తప్పుబడుతున్నాడు. కొన్నింటిని తిరగదోడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాలనలో జరిగిన చాలా విషయాలు బయటపడి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. విస్తుగొలిపే అవినీతి కార్యలాపాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా చూస్తాయేమో కూడా చెప్పలేం. మరి వీటన్నింటికీ కేసీఆర్ కు, ఇతర బాధ్యులకు శిక్షలు పడతాయో లేదో చెప్పలేం. అవినీతిలో ఇరుక్కున్న, తప్పుడు పనులు చేసిన ఉన్నతాధికారులు, కొందరు పెద్దలు తమ వెనుక సూత్రధారి గులాబీ బాసేనని చెబుతున్నారు.
సరే.. దీన్ని కాసేపు అలా ఉంచితే, రేవంత్ రెడ్డి తన ముద్ర వేసే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తున్నాడు. కేసీఆర్ అధికారంలో ఉండగా దీనిపై కసరత్తు చేసినా అధికారిక గీతాన్ని ప్రజల ముందుకు తేలేకపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద శ్రద్ధ పెట్టాడు. అందెశ్రీ ఎప్పుడో రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ఆవిష్కరించబోతున్నాడు. సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి తుది మెరుగులు దిద్దుతున్నాడు. కీరవాణి మూడు వెర్షన్లు తయారుచేశాడు.
ఒక వెర్షన్ స్కూల్స్ లో ప్రేయర్‌గా ఉంటుంది. మరోటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆలపిస్తారు. ఇంకోటి జనరల్ గా ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ (టీఎస్) ను తెలంగాణగా (టీజీ) గా మార్చారు. టీఎస్ ను రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఎందుకో అది రేవంత్ కు నచ్చలేదు. టీజీగా మార్చాలని ఆదేశించాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉద్యమకారులు గోడల మీద టీజీ పేరుతోనే నినాదాలు రాశారు. మరి రేవంత్ కు ఇది గుర్తుకొచ్చిందేమో.
ఇక ప్రభుత్వ అధికారిక ముద్రలో (ఎంబ్లెమ్) మార్పులు చేయాలని నిర్ణయించాడు. దాని మీద కూడా కసరత్తు సాగుతోంది. ఇప్పుడున్న అధికారిక ముద్రలో రాచరిక చిహ్నాలు ఉన్నాయని రేవంత్ భావన. అది ప్రజాస్వామికంగా ఉండాలట. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. రాష్ట్రం విడిపోయాక కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం తయారుచేయించాడు. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ లోనూ ఉంది. కేసీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు దానికి దండం పెట్టుకొని, పూలు చల్లి వెళతాడు.
కొన్ని ఊళ్లలో తెలంగాణ తల్లి చౌరస్తాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదని రేవంత్ భావించాడు. అందుకే దాంట్లో కూడా మార్పులు చేస్తున్నాడు. గీతం, ఎంబ్లమ్ అండ్ విగ్రహం…ఈ మూడు ఆవిర్భావ దినోత్సవంలో ఆవిష్కారిస్తాడు. ఇక భూములకు సంబంధించి ధరణి పోర్టల్ కేసీఆర్ తయారుచేయించాడు. అది ఎంతో గొప్పదని కేసీఆర్, కేటీఆర్ మంత్రులు, నాయకులు ఊదరగొట్టిపారేశారు. కానీ అదో పెద్ద అవినీతి పుట్ట అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బయట పడింది. దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు.
పది జిల్లాల తెలంగాణను కేసీఆర్ 33 జిల్లాల తెలంగాణ చేశాడు. దాన్ని గట్టిగా సమర్ధించుకున్నాడు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని హైలెట్ చేశాడు. మీ జిల్లా తీసేస్తారట అని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే జిల్లాలను తగ్గిస్తామని ప్రకటించాడు. మొత్తం రాష్ట్రాన్ని 17 జిల్లాలు చేస్తామన్నాడు. ఇంకా దీని మీద కసరత్తు మొదలు కాలేదు. మరి రేవంత్ ఇంకెన్ని మార్పులు చేస్తాడో చూడాలి.