పిన్నెల్లికి ఊర‌ట‌!

ఏపీ హైకోర్టులో ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఊర‌ట ద‌క్కింది. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ దక్కింది. ఆ త‌ర్వాత‌, మ‌రో మూడు కేసులు తెర‌పైకి వ‌చ్చాయి.…

ఏపీ హైకోర్టులో ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఊర‌ట ద‌క్కింది. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ దక్కింది. ఆ త‌ర్వాత‌, మ‌రో మూడు కేసులు తెర‌పైకి వ‌చ్చాయి. వీటిని స‌వాల్ చేస్తూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్ర‌యించారు. సోమవారం విచార‌ణ ముగిసి తీర్పు రిజ‌ర్వ్ అయ్యింది.

మంగ‌ళ‌వారం తీర్పు వెలువ‌డింది.  ఈ సంద‌ర్భంగా పోలింగ్‌కు ముందు, త‌ర్వాత ఆయ‌న‌పై న‌మోదైన మూడు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పిన్నెల్లికి ఊర‌ట ల‌భించిన‌ట్టైంది. ఇప్ప‌టికే ఈవీఎం ధ్వంసం కేసులో ఈ నెల 6వ తేదీ వ‌ర‌కు పిన్నెల్లిని అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ కీల‌క ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

ఈవీఎం ధ్వంసం కేసులో విధించిన ష‌ర‌తులే మూడు కేసుల్లోనూ వ‌ర్తిస్తాయ‌న్న హైకోర్టు స్ప‌ష్టం చేసింది. మాచ‌ర్ల‌కు పిన్నెల్లి వెళ్ల‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే ఏపీ హైకోర్టు ష‌ర‌తులు విధించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల కౌంటింగ్ నిమిత్తం న‌ర‌సరావుపేట‌కు పిన్నెల్లి వెళ్లొచ్చు. సొంత నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న వెళ్ల‌కూడ‌దు. 

పిన్నెల్లి బెయిల్‌పై ఎట్ట‌కేల‌కు ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. పిన్నెల్లిని ఎలాగైనా జైలుకు పంపాల‌ని టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. బీజేపీతో పొత్తు నేప‌థ్యంలో టీడీపీకి ఈసీ, పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తున్నాయ‌నే ఆరోప‌ణ అధికార పార్టీ నుంచి బ‌లంగా వినిపిస్తోంది. పిన్నెల్లిపై కేసు న‌మోదు ఇందుకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఏది ఏమైనా పిన్నెల్లికి కౌంటింగ్ అనంత‌రం రెండు రోజుల ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు పిన్నెల్లి భ‌విష్య‌త్‌ను తేల్చ‌నున్నాయి.