దేశం సుభిక్షంగా వుండాలంటే వర్షాలు బాగా పడాలి. పంటలు బాగా పండాలి. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయితే, అంతకంటే ఆనందం మరొకటి వుండదు. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత వ్యవస్థ. రైతాంగం మంచీచెడుల గురించి మన పాలకులకు ఏ మాత్రం పట్టింపు వుండదు. రైతాంగానికి సాగునీరు అందించాలన్న ధ్యాస పాలకుల్లో చాలా తక్కువ.
అందుకే దేశంలో వర్షాలు పడితేనే పంటలు పండే పరిస్థితి. లేదంటే పంటలతో పాటు రైతాంగం కూడా ఎండాల్సిందే. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. ఈ నెలాఖరుకు కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.
ఆ తర్వాత రెండుమూడు రోజులకు ఏపీని తాకనున్నాయి. దీంతో జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య సాధారణం కంటే అధిక వర్షాలు ఏపీలో కురవనున్నాయి. వాతావరణశాఖ సూచించినట్టు నైరుతి రుతుపవనాలు వల్ల వర్షాలు బాగా పడడం కంటే కావాల్సింది ఏముంటుంది?
వర్షాలు అదునుకు పడితే ఖరీఫ్ పంటల సాగుకు రైతాంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే కొద్దోగొప్పో పడిన వర్షాల కారణంగా రైతాంగం దుక్కులు చేసుకుంటోంది. ఖరీఫ్‌లో పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితిలో వర్షాలు బాగా పడతాయనే సమాచారం రైతాంగాన్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతోంది.