ఎన్నికలు వచ్చి కీలకమైన సమ్మర్‌ను ఎత్తుకుపోయాయి. థియేటర్లు దిగాలుపడ్డాయి. ఎగ్జిబిటర్లకు కోట్లలో నష్టం వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి. గత వారం, ఆ ముందు వారం సినిమాలు విడుదలైనా జనం నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సినిమాలు కూడా అలాగే వున్నాయి. అందువల్ల ప్రేక్షకుల నాడి ఇంకా అందలేదు.
సరైన సినిమా పడితే మళ్లీ థియేటర్లు కళకళలాడతాయా? అన్న ప్రశ్న అలాగే వుంది. సమ్మర్ హాలీడేస్ సీజన్ మరో రెండు వారాల వరకు వుంది. అందువల్ల థియేటర్లలోకి మంచి సినిమా వస్తే జనం వచ్చే అవకాశం వుంది.
ఈ వారం సరైన సినిమాలే విడుదలవుతున్నాయి. సితార సంస్థ నుంచి విష్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. అందువల్ల జనాలకు నచ్చే జానర్ నే. సినిమా బాగుంటే అన్న సంగతి పక్కన పెడితే ముందుగా రీజనబుల్ ఓపెనింగ్ అయితే రావాలి.
అలాగే ఆనంద్ దేవరకొండ ‘గం.. గం.. గణేశా’ విడుదలవుతోంది. ట్రయిలర్ బాగానే ఆకట్టుకుంది. రష్మిక ప్రీ రిలీజ్ గెస్ట్ గా వచ్చి బజ్ ను పెంచింది. అందువల్ల ఈ సినిమాకు కూడా రీజనబుల్ ఓపెనింగ్ పడాల్సి వుంది.
యువి సంస్థ హీరో కార్తికేయతో ఓ ఫన్ థ్రిల్లర్ ను ‘భజే వాయు వేగం’ అంటూ విడుదల చేస్తోంది. దానికి ఓ మాదిరిగా అయినా టికెట్ లు తెగాలి. ఓపెనింగ్ తరువాత వచ్చే టాక్ ను బట్టి ఏ సినిమా నిల్చుంటుంది అన్నది వుంటుంది. ఓపెనింగ్ తెగి, టాక్ బాగుండి, జనాలు వస్తే థియేటర్ల యజమానులు ఊపిరి పీల్చుకుంటారు. పనిలో పనిగా నిర్మాతలు కూడా. లేదూ… సినిమాలు బాగా లేక జనాలు రాకపోతే అది వేరే సంగతి.
సినిమాలు బాగుండీ, టాక్ బాగుండీ, జనాలు రాకపోతే, ఇక నిట్టూర్చాల్సిందే. జూన్ నెలాఖరుకు వచ్చే ప్రాజెక్ట్ కే విడుదల వరకు అంటే మరో నెల రోజులు థియేటర్లు నష్టాలు భరించాల్సిందే.