జూన్ 1న దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు ముందు మళ్లీ మోదీ సర్కార్ వస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఆ తర్వాత దేశంలో రాజకీయ వాతావరణం మారిందనే టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీ హవా తగ్గడం కనిపించిందని అంటున్నారు.
ఇండియా కూటమితో పోలిస్తే ఎన్డీఏ కూటమికి కాస్త మొగ్గు కనిపిస్తున్నా… ఖచ్చితంగా చెప్పలేమని కొందరు అంటున్నారు. అయితే ఎన్డీఏ కూటమే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మెజార్టీ సర్వే సంస్థల అభిప్రాయం.
ఇదిలా వుండగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల 4న ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 1న ఎగ్జిట్ ఫలితాలు రానున్నాయి. 4న వెల్లడయ్యే ఎగ్జాట్ ఫలితాల కంటే 1న ఎగ్జిట్ ఫలితాలపైన్నే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఎగ్జిట్ ఫలితాలు అధికారం ఎవరిదనే విషయమై కొంత స్పష్టత ఇస్తాయనే అభిప్రాయం జనంలో బలంగా వుంది.
ఎగ్జిట్ ఫలితాలను అనుసరించి భారీగా బెట్టింగ్‌లు జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్‌రాయుళ్లు అంటున్నారు. కూటమి వైపు ఎక్కువగా బెట్టింగ్స్ అడుగుతుండడంతో వైసీపీ నేతల్లో భయం కనిపిస్తోంది. వాస్తవ పరిస్థితులపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీ భయాన్ని చూసి, టీడీపీ మరింత రెచ్చిపోతోందనే చర్చకు తెరలేచింది.
ఈ నేపథ్యంలో గెలుపుపై వైసీపీ నేతల్లో ధీమా వున్నప్పటికీ, టీడీపీ నుంచి బెట్టింగ్స్ కట్టేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం వణుకు పుట్టిస్తోంది. దీంతో ఎగ్జిట్ ఫలితాలు చూసి బెట్టింగ్స్ పెడదామని కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఒకటో తేదీ వెల్లడయ్యే ఎగ్జిట్ ఫలితాలు ఏపీ నాడిని ఎంతోకొంత పట్టిస్తాయనే నమ్మకం చాలా మందిలో వుంది. అందుకే ఎగ్జిట్ ఫలితాలు ఎలా వుంటాయో అనే ఉత్కంఠ నెలకుంది.