రక్షణ సినిమాకు సంబంధించి సేమ్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా మేకర్స్ పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా దర్శక-నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ కూడా ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ మేటర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు, అట్నుంచిఅటు ముంబయిలోని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా వెళ్లింది.
ఇంత జరిగిన తర్వాత వీళ్ల మధ్య సయోధ్య కుదిరిందా లేదా అనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ బయటకు చెప్పడం లేదు. మరో 2 రోజులు ఆగండి అనే సమాధానం మాత్రమే వస్తోంది. మరోవైపు ఈ సినిమా జూన్ 7న కచ్చితంగా రిలీజ్ అవుతుందంటూ ప్రకటనలిస్తున్నారు.
ఇలా విడుదల తేదీని ప్రచురిస్తూ ప్రకటనలివ్వడం వెనక అంతరార్థం ఏంటనేది తెలియాల్సి ఉంది. నిజంగానే పాయల్ ప్రచారానికి వచ్చేందుకు అంగీకరించిందా లేక ఆమెపై ఒత్తిడి పెంచేందుకు మేకర్స్ ఇలా ప్రకటనలు గుప్పిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి జూన్ 7 రిలీజ్ అంటే, ఈపాటికి ప్రచారం మొదలెట్టాలి. సత్యభామ, లవ్ మౌళి సినిమా యూనిట్లు ఆల్రెడీ పీక్ లో ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో మనమే సినిమా కాస్త వెనకబడి ఉంది. రక్షణ సినిమా యూనిట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా విడుదలపై, పాయల్ ప్రచారంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.