‘గం..గం..గణేశా’ యాక్షన్ కామెడీ మూవీ

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “గం..గం..గణేశా” సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నిర్మాత వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన…

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “గం..గం..గణేశా” సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నిర్మాత వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించిన “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, నిర్మాతగా తన అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత వంశీ కారుమంచి.

మాది గుంటూరు. యూఎస్ వెళ్లి జాబ్స్, బిజినెస్ చేశాం. లాక్ డౌన్ టైమ్ లో ఇండియాకు వచ్చాము. లాక్ డౌన్ వల్ల యూఎస్ వెళ్లలేకపోయా. యూఎస్ లో ఇంకొన్నేళ్లు ఉండి ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలని అనుకున్నాం. అప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ ఉండేది. అయితే లాక్ డౌన్ లో ఇక్కడే ఆగిపోవడం వల్ల ఆనంద్ తో సినిమా బిగిన్ చేశాం. ఆనంద్, విజయ్ నాకు మంచి మిత్రులు.

దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ కథ చెప్పినప్పుడు ఆనంద్ కు బాగుంటుంది అనిపించింది. అయితే ఆనంద్ ఇలాంటి కథ చేస్తాడా లేదా అనే సందేహం ఉండేది. కథ విన్నాక ఆనంద్ కూడా తనకు కొత్తగా ఉంటుందని భావించి మూవీకి ఓకే చెప్పాడు. ఆనంద్ ఈ సినిమాలో ఫంకీ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర ఇది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా గం గం గణేశా. వినాయక చవితికే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా..అప్పుడు కొన్ని స్ట్రైక్స్ జరగడం, ఆనంద్ బేబి మూవీ మేకోవర్ లో ఉండిపోవడంతో గం గం గణేశాను పోస్ట్ పోన్ చేశాం.

గం గం గణేశా సినిమా నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 400కు పైగా థియేటర్స్ దొరికాయి. నెంబర్ పరంగా మంచి రిలీజ్ అని భావిస్తున్నాం. అమోజాన్ ప్రైమ్ తో ఓటీటీ డీల్ చేసుకున్నాం.

గం గం గణేశా సినిమా ఆనంద్ కు కొత్తగా ఉంటుంది. బేబి సినిమాతో దీన్ని పోల్చవద్దు. అది లవ్ ఎమోషనల్ మూవీ. ఇది క్రైమ్ కామెడీ యాక్షన్ సినిమా. ముఖ్యంగా కామెడీ ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో జనరేట్ అయ్యే కామెడీ మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నవ్విస్తాడు. ఇద్దరు హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి పర్ ఫార్మెన్స్ చేశారు. వీళ్లిద్దరి పాత్రలకు స్కోప్ ఉంటుంది.