రాజకీయం ఒక పందెం అయితే దాని మీద బెట్టింగ్ కాయడం ఇంకా పెద్ద పందెం. ఎవరు గెలిచేది అనేది ఎంతటి రాజకీయ ఘనాపాఠికి అయినా తెలియదు. అలా తెలియని విషయాన్ని మూసి ఉంచిన చేతిలో ఏముందో కంగారు పెట్టి కలవరపెట్టి బెట్టింగులు కాయించడమే కొందరికి అతి పెద్ద వృత్తి.
జగన్ ధీమా అనుకోవచ్చు. వైసీపీ నేతల అతి ఉత్సాహం కావచ్చు. జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా రెండవసారి జగన్ ప్రమాణం చేస్తారు అన్న ఒకే ఒక్క వార్తతో బెట్టింగు రాయుళ్ళు అంతా విశాఖకు మకాం మార్చేశారు.
ఏపీని ఏలే పార్టీ ఏది అంటూ బెట్టింగు రాయుళ్ళు పందేలకు దిగుతున్నారు. జూన్ 9న ప్రమాణం చేసే సీఎం ఎవరు అంటూ మరో బెట్టింగ్ కాస్తున్నారు. జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణం చేస్తారు అంటే దాని మీద అతి పెద్ద మొత్తంలో బెట్టింగ్ ఇలా జోరుగా సాగుతోంది వ్యవహారం.
ఏపీలో వైసీపీ గెలుస్తుంది టీడీపీ వస్తుంది అన్న దాని మీద వందల కోట్లలో పందేలు సాగుతున్నట్లుగా ప్రచారం అయితే ఉంది. వైసీపీ మేమే మళ్లీ అధికారం అని చెప్పడం బెట్టింగు రాయుళ్ళ ఉత్సాహాన్ని మరింతగా ప్రోత్సహిస్తోందని అంటున్నారు.
వీటితో పాటుగా విశాఖలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పార్టీల గెలుపు ఓటముల మీద మెజారిటీల మీద కూడా బెట్టింగ్ రాయుళ్ళు పందేలు కాస్తున్నారు. విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణంతో పాటు భీమిలీ గాజువాక అసెంబ్లీ సీట్లలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న దాని మీద బెట్టింగులు అతి పెద్ద మొత్తంలో సాగుతున్నాయట. బెట్టింగులు గతంలో ఈ స్థాయిలో జరగలేదని అంటున్నారు. విశాఖలో బెట్టింగు రాయుళ్ళ హుషారు చూసి రాజకీయ నేతలు అభ్యర్థులు కూడా ధీమాను పెంచుకుంటున్నారుట.