గాజువాకలో జెండా పాతేది ఆ పార్టీయే?

ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అన్నది ఒక టాలెంట్. ప్రచారంలో ఎన్ని రకాలుగా అయినా చేయవచ్చు. ఓట్లు మాత్రం తమ వైపు తిప్పుకుని వేయించుకోవడం ఒక కళ. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్…

ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అన్నది ఒక టాలెంట్. ప్రచారంలో ఎన్ని రకాలుగా అయినా చేయవచ్చు. ఓట్లు మాత్రం తమ వైపు తిప్పుకుని వేయించుకోవడం ఒక కళ. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసి దాదాపుగా పదిహేడు వేల ఓట్ల తేడాతో ఓడిన గాజువాక మళ్లీ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈసారి అక్కడ భయంకరమైన పోరు సాగింది. నువ్వా నేనా అన్న స్థాయిలో సాగిన ఈ పోరులో టీడీపీ కూటమి గెలుస్తుందా లేక వైసీపీకి పట్టం కడతారా అన్న దాని మీదనే అంతా తర్కించుకుంటున్నారు. గాజువాక సీటు హాటెస్ట్ గా మారడానికి మరో విశేషం ఉంది.

మూడున్నర దశాబ్దాల క్రితం తండ్రులు పోటీ పడిన సీటులో ఈ రోజు తనయులు పోటీ పడుతున్నారు. 1989లో పెందుర్తిలో అంతర్భాగంగా గాజువాక ఉంది. ఆ ఎన్నికల్లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ తరఫున గుడివాడ గురునాధరావు పోటీ చేశారు. టీడీపీ నుంచి పల్లా సింహాచలం పోటీ పడ్డారు. దాదాపు ఇరవై వేల ఓట్ల తేడాతో గురునాధరావు పల్లాను ఓడించారు.

తిరిగి ఇన్నేళ్ళ తర్వాత గురునాధరావు తనయుడు అమర్నాథ్ మంత్రి హోదాలో ఉంటూ గాజువాక నుంచి వైసీపీ తరఫున పోటీకి దిగారు. పల్లా సింహాచలం తనయుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ కూటమి అభ్యర్ధిగా ఉన్నారు. ఇద్దరూ బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారే. అనుభవం కలిగిన వారే.

అయితే పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ ముందంజలో నిలిచింది అని పోస్ట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో కూటమి వెనకబడింది అని అంటున్నారు. అలాగే బలమైన ఒక సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి బాగా పడ్డాయని దాని మీద ఆశలు పెట్టుకున్న కూటమికి కొంత షాక్ కలిగించేలా పరిణామం ఉంది అని అంటున్నారు.

అయితే కూటమి విజయానికి మరో బలమైన సామాజిక వర్గం ఓట్లతో పాటు గతంలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు అన్న సానుభూతి ప్లస్ పాయింట్లు అవుతాయని పల్లా వర్గం అంటోంది. విశాఖ జిల్లాలో భీమిలీ తరువాత అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం గాజువాక. ఈసారి 69 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం మూడు లక్షలకు పైగా ఓటర్లల్లో రెండు లక్షలకు పైగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. మహిళలూ పురుషులూ సమానంగా ఓట్లు వేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం కూడా తీవ్రంగా ప్రభావం చూపింది అని భావిస్తున్న గాజువాకలో జెండా పాతేది ఎవరు అన్నదే అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న