స్పై సినిమాలో స్టైలిష్ యాక్షన్ తో ఆకట్టుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్…అందుకు పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ లో “భజే వాయు వేగం”లో కనిపించనుంది. హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను తన ఇంటర్వ్యూలో తెలిపారు హీరోయిన్ ఐశ్వర్య మీనన్.
సినిమాలో ఇందు అనే క్యారెక్టర్ చేశాను. ఇది కమర్షియల్ సినిమా అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లినట్లు నా క్యారెక్టర్ ఉండదు. “భజే వాయు వేగం” ఒక రా కంటెంట్ మూవీ. యాక్షన్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్ లో కనిపిస్తా. సినిమా అంతా చీరకట్టు లేదా ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా.
స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. ఎంపికగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటా వచ్చా. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. ప్రతి సినిమాను ఇష్టపడే చేస్తాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. నా సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆ ఫలితం ఇచ్చేది ప్రేక్షకులు. వాళ్లకు మూవీ నచ్చాలి. వాళ్లు ఆదరించాలి. అప్పుడే విజయం దక్కుతుంది. స్పై సినిమా విషయంలో నేను అనుకునేది ఇదే. ఆ సినిమా కోసం టీమ్ అంతా శ్రమించారు. కానీ రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు.
“భజే వాయు వేగం” సినిమాలో యాక్షన్, ఎమోషన్ తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉంటుంది. అయితే తక్కువగానే ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను భరతనాట్యం డ్యాన్సర్ ను. మంచి డ్యాన్స్ నెంబర్స్ చేయాలనే కోరిక ఉంది. డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడతా. ఇప్పటిదాకా మంచి డాన్స్ నెంబర్ నాకు దక్కలేదు. పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కమర్షియల్ సినిమా హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమూ ముఖ్యమనే భావిస్తా.
తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న టౌన్ మాది. మధ్య తరగతి కుటుంబం. మా బ్రదర్ డాక్టర్. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్ లో చదువుకుంటున్న టైమ్ లోనే నేను బాగా పాపులర్. కమర్షియల్ యాడ్స్ లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పూర్తిగా నటన మీద ఫోకస్ చేశాను. నేను పరిశ్రమలో తెచ్చుకున్న గుర్తింపునకు గర్వంగా ఉంది. ఆఫర్స్, సక్సెస్ తర్వాత ముందు ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ ఉంటే ఇక్కడ కెరీర్ బాగుంటుంది. ఆ ఆదరణ పొందడం కోసం ప్రయత్నిస్తున్నా. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా.