అనారోగ్యంతో బాధపడుతున్నానని, విచారణకు రాలేనని నటి హేమ బెంగళూరు సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)కి లేఖ రాశారు. అయితే ఆమె లేఖను బెంగళూరు సీసీబీ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. బెంగళూరు సీసీబీ సీరియస్ అయ్యినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హేమపై తదుపరి చర్యలు ఎలా వుంటాయో అనే చర్చకు తెరలేచింది.
ఈ నెల 19న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఇందులో నటి హేమతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు ఫిర్యాదు అందింది. దీంతో బెంగళూరు నార్కోటిక్ టీమ్ వారందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది.
ఈ నేపథ్యంలో హేమను ఇంటికి పంపాను. తాము చెప్పినప్పుడు విచారణకు రావాలని బెంగళూరు సీసీబీ ఆదేశించింది. ఇవాళ విచారణకు రావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. అయితే తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు రాలేనంటూ వారికి హేమ లేఖ రాశారు. ఇదంతా విచారణ తప్పించుకోడానికే అని బెంగళూరు సీసీబీ భావిస్తోంది.
హేమ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. హేమపై తదుపరి చర్యలకు దిగే అవకాశం వుంది. హేమకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందే అని స్పష్టం చేయడం, కాదు, కూడదంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకూడదని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. హేమ విచారణకు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.