తెలంగాణ రాష్ట్ర గీతానికి అంటే అధికారిక గీతానికి ఆంధ్రా వ్యక్తి సంగీతం ఇవ్వడమేంటి? ఇదీ ఇప్పుడు తెలంగాణలో రగులుతున్న వివాదం. గత మూడు నాలుగు రోజులుగా దీనిపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు ఇంకా ఎంటరైనట్లు కనబడటంలేదు. ఆంధ్ర వాళ్ళు కూడా ఎవరూ కల్పించుకోలేదు. తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ మాత్రమే గొడవ చేస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాసింది.
జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీని పర్మిషన్ కూడా అడిగింది. కొన్ని షరతులతో ఈసీ ఓకే చెప్పింది. దీన్ని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తారు. ఈ వేడుకల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చేత ఈ పాటను రిలీజ్ చేయించాలని నిర్ణయించారు.
ఇది విడుదలైనప్పటి నుంచి ఈ పాట తెలంగాణ అధికారిక గీతమవుతుంది. అంటే ప్రభుత్వం నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ గీతాన్ని ఆలపిస్తారు. విద్యా సంస్థల్లోనూ పాడతారు. నిజానికి అందెశ్రీ ఈ పాట కొత్తగా రాసింది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ పాట పాపులరైంది. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం కాగానే తెలంగాణకు అధికారిక గీతం ఉండాలని భావించి ఈ పాటను సెలెక్ట్ చేశారు. అప్పట్లోనే ఈ పాటకు ఆయనే స్వయంగా సవరణలు చేశారు.
పెద్దగా ఉన్న (సుమారు 6 నిమిషాలు) ఈ పాటను కుదించారు. కానీ ఆయన పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర గీతంగా చేయలేకపోయారు. కారణం తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు సందర్భం కూడా కలిసి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీనికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం ఇస్తుండటం వివాదంగా మారింది.
ఈ పాట ఆయ్హనే పాడాడని అంటున్నారు. (దివంగత సినిమా నేపథ్య గాయకుడు రామకృష్ణ పాడిన ఇదే పాట యూట్యూబ్లో ఉంది) దీనికి తెలంగాణా సినీ మ్యూజిక్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతోంది. తెలంగాణా అధికారిక గీతం ఎంతో ప్రతిష్టాత్మకం కాబట్టి దానికి సంగీతం చేసే బాధ్యతను తెలంగాణ సంగీత దర్శకుడికి అప్పగిస్తే బాగుండేదని అంటున్నారు. ఆంధ్రా సంగీత దర్శకుడికి ఈ బాధ్యత ఇవ్వడమంటే తెలంగాణను అవమానించడమేనని మండిపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, ఆత్మ గౌరవం కోసమని అలాంటిది ఇప్పుడు ఆ మౌలిక భావనకే విఘాతం కలిగిందని అంటున్నారు. తెలంగాణలో ప్రతిభగల కళాకారులు లేరా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణ సంగీత కళాకారుల ఆవేదనకు ప్రభుత్వం నుంచి గానీ, పాట రచయిత నుంచి గానీ ఏమీ స్పందన రాలేదు. అసలు రేవంత్ రెడ్డి ఇదేమీ పట్టించుకోలేదు.
ఆయన కీరవాణి స్టూడియోకు వెళ్లి పాట గురించి చర్చించారు కూడా. ఆయన చేసిన మూడు వెర్షన్లు విన్నారు. కొన్ని సూచనలు చేశారు. అసలు ఈ పాటకు కీరవాణే సంగీతం చేయాలని అందెశ్రీయే సూచించాడని వార్తలు వచ్చాయి. అందుకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహమా, మరో కారణమా తెలియదు. నిజానికి తెలంగాణలోనూ మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కాదనం. చాలా పాపులరైన తెలంగాణ పాటలు కొన్ని యూట్యూబ్ లో ఉన్నాయి.
ఒకప్పటి ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తెలంగాణ వాడే. ఆయన పాటలను ఆంధ్రా వాళ్ళు ఆదరించారు కదా. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని కీర్తిస్తూ తెలంగాణ ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ చేత ఆంధ్రావాళ్ళు ఒక పాట రాయించారు. మరి ఆంధ్రాలో కవులు లేరా? ఆ పాట యూట్యూబ్ లో ఉంది. దివంగత గద్దర్ కు ఆంధ్రలో బొచ్చెడుమంది అభిమానులున్నారు. ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు. కాకపొతే తెలంగాణ సంగీత దర్శకుల ఆవేదన ఏమిటంటే అధికారిక గీతానికి సంగీతం సమకూర్చే అవకాశం పోయిందనే.