వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చీకటి రోజు ఏదైనా వుందంటే… అది ఆయన్ను జైల్లో వేయడం. 2012, మే 27వ తేదీ వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన్ను జైలు పాలు చేసింది. జైలు జీవితం జగన్‌కు ఎన్నో పాఠాలు నేర్పింది. జైల్లో గడిపిన ప్రతి క్షణాన్ని జగన్ తన రాజకీయ సోపానానికి వ్యూహాలు రచించేందుకు సద్వినియోగం చేసుకున్నారు.
జగన్‌ను జైల్లో వేసి, వైసీపీని మొగ్గు దశలోనే చంపేయాలని కుట్రలకు తెరలేపిన పార్టీలే… ఆ తర్వాత కాలంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ను వీడి, వైఎస్సార్‌సీపీ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్న జగన్‌ను అణచి వేయాలని నాడు కేంద్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలకు పాల్పడింది. ఆ పార్టీకి రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జత కలిశారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలిసి జగన్‌ను జైల్లో పెట్టగలిగారే తప్ప, రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకోలేకపోయారు.
ఒక విత్తనం భూమిలో చీకటిని చీల్చుకుని, నిటారుగా మొలకెత్తి, మహా వృక్షమైనట్టు… జగన్ కూడా ఇంతింతై అన్న రీతిలో, శత్రువులు జీర్ణించుకోలేనంతగా ఎదిగారు. నేడు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పరిపాలన కాలాన్ని కూడా పూర్తి చేసుకుని, ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేమన్న లెవెల్‌లో రాజకీయ శిఖరాన్ని అధిరోహించారు.
వైఎస్ జగన్ అక్రమాస్తులను సంపాదించారంటూ 2010, నవంబర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జగన్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత 2011లో జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలంటూ టీడీపీ నాయకులు ఎర్రంనాయుడు, అశోక్‌గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2011, జూలై 11న ఎమ్మార్ ప్రాపర్టీస్‌పై ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
అలాగే జూలై 12న వైఎస్ జగన్ సాక్షి పెట్టుబడులపై దర్యాప్తు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే నెలలో నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సీబీఐ సమర్పించింది. ఆగస్టు 1న రెండో నివేదికను సమర్పించింది. 2012 జనవరి 2న జగతి సంస్థల వైస్ చైర్మన్, వైఎస్ కుటుంబానికి ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డిని అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం మే 25న సీబీఐ ఎదుట జగన్ హాజరయ్యారు.
దీంతో జగన్ అరెస్ట్‌పై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన నెలకుంది. వరుసగా మూడు రోజుల పాటు జగన్‌ను సీబీఐ విచారించింది. చివరికి మే 27న రాత్రి 7 గంటల తర్వాత జగన్‌ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటించింది. ఏపీలో రాజకీయంగా పెను సంచలనం.
ఏకంగా 16 నెలల పాటు జగన్ జైల్లో గడపాల్సి వచ్చింది. నాడు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న యూపీఏ-2 ప్రభుత్వం జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐతో వరుస పిటిషన్లు వేయించిందన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్‌ను జైల్లోనే వుంచి, వైఎస్సార్‌సీపీని అంతం చేయాలనుకున్న పార్టీలే చివరికి విభజిత ఏపీలో నామరూపాల్లేకుండా పోయాయి. టీడీపీ పాలిట జగన్ సింహస్వప్నమయ్యారు. వామ్మో… జగన్‌ను ఎదుర్కోలేమని చంద్రబాబు భయపడేంతగా జగన్ ఎదిగారు. ఎన్నికల్లో జగన్‌ను ఢీకొట్టేందుకు జనసేన, బీజేపీని చంద్రబాబు తోడు తెచ్చుకున్నారు.