ఈ దఫా 400 ఎంపీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీకి అంత సీన్ లేదని మరోవైపు సర్వేలు చెబుతున్నాయి. సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదనే మాట బలంగా వినిపిస్తోంది. మిత్రపక్ష పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గొప్ప అంటున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా జోస్యాలు మాత్రం ఆకాశమే హద్దు అంటున్నాయి. తాము పొత్తు కుదుర్చుకున్న చోట అద్భుత ఫలితాలు సాధిస్తామని ఆయన చెబుతున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌కు వచ్చే సీట్లపై సంచలన కామెంట్స్ చేశారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ సీట్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్ల కంటే మించవని సంచలన కామెంట్స్ చేశారు.
కానీ ఐదు దశల్లో ప్రధాని మోదీ 300 సంఖ్యను అధిగమించారన్నారు. ఆరో విడతలో 400 దాటారని గొప్పలు చెప్పుకొచ్చారు. ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు.