సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నటి హేమకు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
రేవ్ పార్టీ మేటర్ బయటకొచ్చినప్పట్నుంచి సీసీబీకి, హేమకు మధ్య కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. రేవ్ పార్టీ మీడియాకెక్కిన వెంటనే తను ఆ పార్టీలో లేనని, తన ఫామ్ హౌజ్ లో ఛిల్ అవుతున్నానంటూ హేమ వీడియో పెట్టారు. ఆ వెంటనే బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను రిలీజ్ చేశారు.
ఆ మరుసటి రోజు తన హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఓ రెసిపీ వీడియోను పోస్ట్ చేశారు హేమ. దానికి కౌంటర్ గా బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ ను బయటపెట్టింది సీసీబీ. టెస్టులో పాజిటివ్ గా తేలినట్టు ప్రకటించింది. దీంతో హేమ డ్రగ్స్ తీసుకున్నారనే విషయంపై అంతా నిర్ధారణకొచ్చారు.
ఇది జరిగిన తర్వాత తనను సంప్రదించిన మీడియాతో పెద్దగా మాట్లాడలేదు హేమ. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వ్యవహరించారు. ఈ మేటర్ ను ఎలా తేల్చుకోవాలో తనకు తెలుసన్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు.
రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు పోలీసులు. వాటిని పరీక్షించగా 86 మంది మాదకద్రవ్యాలు సేవించినట్టు బయటపడింది. వాళ్లలో హేమ కూడా ఉన్నారు. దీంతో వెంటనే హేమకు నోటీసులు జారీ చేశారు. మిగిలిన వాళ్లకు కూడా విడతలవారీగా నోటీసులు ఇస్తున్నారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి చిత్తూరు మూలాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ను ఏ2గా, రణధీర్ ను ఏ4గా చేర్చారు. వీళ్లలో రణధీర్ డెంటిస్ట్ కాగా, అరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. పట్టుబడిన వాళ్లలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నట్టు తేలింది.