ఈ డైలాగ్ అన్నోళ్లని జైల్లో పెట్టాల్సిందే!

‘‘నేనొక వంద మందిని తయారు చేశాను. ఎవరైనా దూషించినా, దాడులకు దిగినా అలాంటివారిని చంపడానికి వారు రెడీగా ఉంటారు. వారిని చంపే ప్రయత్నంలో తాము చచ్చిపోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటారు. ఆత్మాహుతి దళాలు వాళ్లు’’ …

‘‘నేనొక వంద మందిని తయారు చేశాను. ఎవరైనా దూషించినా, దాడులకు దిగినా అలాంటివారిని చంపడానికి వారు రెడీగా ఉంటారు. వారిని చంపే ప్రయత్నంలో తాము చచ్చిపోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటారు. ఆత్మాహుతి దళాలు వాళ్లు’’ 

ఈ డైలాగు ఎవరైనా చెబితే, వారిని మీరు ఏమంటారు? ఉగ్రవాదులు అని అంటారా? లేదా? ఈ మాట అన్నవాళ్లు ఏ తాలిబన్లో, ఇతర అత్యంత తీవ్రమైన ఉగ్రవాద సంస్థల నాయకులో అని అనుకుంటారా లేదా? అలా ఆత్మాహుతి దళాలను తయారు చేస్తున్న వారిని.. విచారించి, శిక్షించాలని, నిలువునా ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తారా? లేదా? ఇలాంటి కోపం మీకు రావడం, ఆ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాలనుకోవడం చాలా సహజం.

కానీ.. ఆ మాట అన్నది ఏ ఉగ్రవాద సంస్థ నాయకుడో కాదు.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అసలే ఠికానా లేకుండా కునారిల్లుతున్న తెలుగుదేశం పార్టీలో, అంతకంటె దిక్కులేకుండా అలమటిస్తున్న ఒక నాయకుడు అన్న మాటలు ఇవి. ఈ మాటలు అన్న వ్యక్తిని ఏం చేయాలి? పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలా? అక్కర్లేదా? ఇవేమీ సదరు నాయకుడు తన ప్రెవేటు రహస్య సంభాషణల్లో అన్నటువంటి మాటలు కావు. బహిరంగ కార్యక్రమంలో అన్న మాటలే. ఆ మాటలు పత్రికల్లో కూడా వచ్చాయి. 

తెలుగుదేశం పార్టీలో మీడియా ముందు మాట్లాడ్డం తప్ప ప్రజాదరణ పరంగా ఠికానా లేని నాయకుల్లో ఒకరు బుద్ధా వెంకన్న. ఆయన చంద్రబాబు జన్మదినం సందర్భంగా రెచ్చిపోయి మాట్లాడారు. బాబును ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా మాటలు ఉంటాయి గనుక.. ఏదోలే అనుకోవచ్చు. కానీ హద్దు మీరి కొన్ని విషయాలు బయటపెట్టారు. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని కాపాడడానికి ఆయన ఒక ఆత్మాహుతి దళాన్ని తయారు చేశాడట. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే, దూషిస్తే చంపడానికైనా, చంపడానికైనా ఆ దళం సిద్ధంగా ఉంటుందిట. 

ఈ రకంగా హత్యలకు లేదా ఆత్మహత్యలకు తాను వందమని ప్రేరేపిస్తున్నట్లు ఆయన స్వయంగా చెబుతున్నారు. పోలీసులు ఈ ప్రకటనను సుమోటోగా తీసుకుని బుద్ధా వెంకన్నను తక్షణం అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన తయారుచేసిన దళంలోని వంద మంది ఎవరో.. ఆయన ద్వారా వివరాలు తీసుకుని.. వారు ఎలాంటి హత్యలు చేయకుండా లేదా ఆత్మహత్యలు చేసుకోకుండా గమనించాల్సి ఉంది. వారి కదలికల్ని నిఘా కింద పెట్టాలి. 

ఆ వంద మంది మీద రౌడీషీట్లు ముందే ఓపెన్ చేసి.. నిత్యం పోలీసు నిఘా కింద ఉంచాలి. లేకపోతే బుద్ధా వెంకన్న చెబుతున్నట్లుగా వారు చంపడాలు మొదలుపెట్టేస్తారు. శాంతిభద్రతలు అదుపుతప్పిపోతాయి. కాబట్టి.. పోలీసులు బుద్ధా వెంకన్న ప్రకటన పట్ల సుమోటోగా స్పందించి.. ఆయనను జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నదని పలువురు డిమాండ్ చేస్తున్నారు.