ఫస్ట్ నైట్ అంటే పెళ్లికూతురులో కాస్త బెరుకు ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లికొడుకు ఇబ్బంది పడ్డాడు. ఎంతలా అంటే, ఫస్ట్ నైట్ అంటే భయపడి ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. పల్నాడు జిల్లాలో జరిగింది ఈ ఘటన.
మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ కు, తెనాలికి చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత తన భార్యను తీసుకొని మాచర్ల వచ్చాడు కిరణ్. ఫస్ట్ నైట్ కోసం తిరిగి తెనాలి వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా గుంటూరు బస్టాప్ లో దిగిన కిరణ్, ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు.
ఎప్పటికీ రాకపోవడంతో కిరణ్ భార్యతో పాటు బంధువులు చుట్టుపక్కల గాలించారు. కనిపించకపోవడంతో, కిరణ్ తల్లిదండ్రులకు సమాచారం అందించి తెనాలి వెళ్లిపోయారు. అలా ఆరోజు జరగాల్సిన ఫస్ట్ నైట్ జరగలేదు.
కట్ చేస్తే, కృష్ణానది దగ్గర్లో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా కాల్ చేసి వివరాలు సేకరిస్తే, అది గుంటూరు బస్టాండ్ నుంచి వెళ్లిపోయిన కిరణ్ దిగా తేలింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మృతదేహంపై హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో.. దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు పోలీసులు.
మరోవైపు మృతుడి తల్లి ఇచ్చిన సమాచారం అందర్నీ ఆశ్చర్యపరిచింది. శోభనం అంటే చాలా భయటపడ్డాడట కిరణ్. స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ వినలేదంట. శోభనం అంటే భయం, ఆందోళనతో తన కొడుకు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్వయంగా కిరణ్ తల్లి వెల్లడించింది.