విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనేది జగన్ పట్టుదల. కోర్టు కేసుల వల్ల అది కాస్త ఆలస్యం అవుతున్నా.. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ నాయకులు పదే పదే చెప్పడం, ఇతరత్రా కారణాలతో విశాఖ టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. అయితే విశాఖ విషయంలో వైసీపీకి కాస్త చేదు అనుభవం ఉంది.
ఏపీ అసెంబ్లీలో 151 స్థానాలు గెలిచినా.. విశాఖ నలుగు దిక్కులూ టీడీపీకే దక్కాయి. ఒక దిక్కు ఇప్పటికే వైసీపీ గూటికి చేరింది. గంటా శ్రీనివాస్ గోడమీద పిల్లివాటంగా ఉన్నారు. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో విశాఖలో వైసీపీ తరపున రాజకీయం మొత్తం విజయసాయిరెడ్డి చూస్తున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు, నేటివ్ ఆఫ్ నెల్లూరు జిల్లా. కానీ రాజకీయం మొత్తం విశాఖ కేంద్రంగా చేస్తూ అక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విశాఖలో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే అనేది కాదనలేని సత్యం.
ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయ కర్తగా ఉండటంతో సహజంగానే అక్కడ పార్టీ వ్యవహారాలు, విశాఖ రాజకీయాలు అన్నీ విజయసాయికే అప్పగించినట్టయింది. అయితే సడన్ గా ఇప్పుడు సీన్ మారింది. విజయసాయికి విశాఖ దూరమైంది. వైరి వర్గాలకు ఇది సంతోషకరమైన వార్తే అయినా.. జగన్ నిర్ణయం మాత్రం దూరదృష్టితో తీసుకున్నట్టే తెలుస్తోంది.
ఇటీవల కొంతకాలంగా విజయసాయిరెడ్డి విశాఖపై పట్టు కోల్పోతారనే కథనాలు వచ్చాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. కొత్త జిల్లాల వారీగా ఇంచార్జీలను నియమించిన సీఎం జగన్, అందులో విజయసాయిరెడ్డికి చోటివ్వలేదు. కనీసం రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న స్థానాన్ని కూడా కొనసాగించలేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు సమన్వయకర్తగా సజ్జలకు కీలక పదవి అప్పగించారు. విజయసాయిరెడ్డిని మాత్రం పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జిగా నియమించారు. పార్టీ విభాగాల పటిష్టతే పార్టీ పటిష్టత అని జగన్ భావించి ఉండొచ్చు.
కానీ ఇన్నాళ్లూ విశాఖ అంటే విజయసాయి, విజయసాయి అంటే విశాఖ అనే పేరుండేది. ఇప్పుడది లేకుండా పోయింది. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను నియమించారు. అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. సో.. ఇక విశాఖపై పెత్తనం వారిద్దరిదే కావొచ్చు.