సోనియాగాంధీ కుటుంబం మొదటిసారి కాంగ్రెసేతర పార్టీకి ఓటు వేసింది. దేశ వ్యాప్తంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అయితే మొదటిసారి వారంతా తాము ప్రాతినిథ్యం వహించే పార్టీకి కాకుండా, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి ఓట్లు వేయడం విశేషం. న్యూఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా ఆ సీటును ఆప్ పార్టీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది.
కాంగ్రెస్ అగ్ర నాయకులైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు తమ పార్టీకి కాకుండా ఆప్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి ప్రధాన ధ్యేయం మోదీ సర్కార్‌ను గద్దె దించడం. అయితే ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఇండియా కూటమి సీట్లు సాధిస్తుందనేది చర్చనీయాంశమైంది.
ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల్ని మోదీ సర్కార్ తన చేతిలో వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని బెదిరిస్తోందన్న విమర్శ దేశ వ్యాప్తంగా బలంగా వుంది. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు అనుమతితో ఆయన జైలు నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో తిరిగి ఆయన జైలుకు వెళ్లాల్సి వుంది.