రాజకీయాల్లో కేఏ పాల్‌ను జోకర్‌గా అభివర్ణిస్తుంటారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అంతకు మత ప్రబోధకుడిగా పాల్‌కు ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం, గౌరవం వుండేది. అవి పోగొట్టుకుని పాల్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో ఎవరికీ అర్థం కాదు. పాల్‌ను రాజకీయ జోకర్‌గా అందరూ చూస్తుంటారు.
అయితే పాల్‌ను ఆ విధంగా చూడడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించడం లేదు. పాల్‌పై ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడయా సమావేశంలో కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాల్‌ను జోకర్ అనడం సరికాదని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలైన జోకర్ అని ఆయన సెటైర్ విసిరారు.
కరెంట్ కోతల గురించి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ఆయన్ను జోకర్‌ను చేశాయని కేటీఆర్ విమర్శించారు. ఆస్పత్రిలో కరెంట్ పోతే, జనరేటర్ వుండదా? పైఅంతస్తులోకి ఎలా వెళ్లాలని మంత్రి ప్రశ్నించడం విడ్డూరంగా వుందని ఆయన మండిపడ్డారు. ఇదేం ప్రభుత్వమని ఆయన నిలదీశారు. తమ పాలనలో ఎన్నడూ ఇలా కరెంట్ కోతల గురించి మాట్లాడే దుస్థితి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయాల్లో దేశంలో తెలంగాణ కంటే ముందు ఏ రాష్ట్రం ఉందో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని కేటీఆర్ కోరారు. ఇది నిరూపిస్తే ఆదివారం ఇదే సమయానికి తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తన సవాల్ స్వీకరించడానికి సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.