టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా భయపడుతోంది. అందుకే ఆయన్ను వారంతా టార్గెట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన పనేదో తాను చేసుకుంటున్నారు. 2009లో టీడీపీకి ఎన్నికల ప్రచారం చేస్తూ, రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉంటూ కూడా టీడీపీని గెలిపించాలని జూనియర్ ఎన్టీఆర్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వైఎస్సార్ బుడ్డోడని సరదాగా అనడం చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయితే మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం వివాదాస్పదమైనప్పుడు, ఇది సొంత వేడుక అని రావాలని, ఎవరూ ప్రత్యేకంగా ఆహ్వానించరంటూ నందమూరి బాలకృష్ణ దెప్పి పొడిచిన సంగతి తెలిసిందే. బాలయ్య కామెంట్స్‌ను అప్పట్లో నందమూరి హరికృష్ణ తప్పు పట్టారు. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టారనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.
ఇదంతా లోకేశ్‌ను టీడీపీ వారసుడిగా చేయడం కోసమే అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఆ పార్టీ అధికారిక చానల్‌లో నిర్వహించిన చర్చలో అసలు ఎన్టీఆర్‌కు, తమ పార్టీకి సంబంధం ఏంటని ప్రశ్నించడం సరికొత్త చర్చకు దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీకి దూరం చేయడం అంటే, లోకేశ్‌కు పూర్తిగా అడ్డు తొలగించే కుట్రకు తెరలేపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బుద్ధా వెంకన్నతో లోకేశే మాట్లాడించి వుంటారనే అభిప్రాయం కూడా లేకపోలేదు. టీడీపీని నడిపించే శక్తి సామర్థ్యాలు లేవని ఆ పార్టీ నాయకుల బలమైన అభిప్రాయం. చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పార్టీని కాపాడగలరని టీడీపీ నాయకులు విశ్వసిస్తున్నారు. దీంతో లోకేశ్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలంటూ బుద్ధా వెంకన్న డిమాండ్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీకి సంబంధం లేదనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్నారని స్పష్టమవుతోందని అంటున్నారు.