పదేళ్ల కిందట ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేశారు. అప్పుడు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుని కాంగ్రెస్ అంటేనే జనాల్లో అసహ్యం పుట్టేలా చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించాడనే పేరు వచ్చింది. మోడీ వ్యూహాల్లో అడుగుడుగునా పీకే ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయంతో మోడీకి ఎంత లాభించిందో, అదే స్థాయిలో ప్రశాంత్ కిషోర్ కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా గిరాకీ ఏర్పడింది! ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను నమ్ముకుంటే చాలదు, పొలిటికల్ స్ట్రాటజీలను నమ్ముకోవాలని రాజకీయ నేతల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. పీకే వారికి కనిపించాడు. దీంతో దేశంలోని అనేక పార్టీలు ఆయన స్ట్రాటజీలను తీసుకోవడానికే ప్రాధాన్యతను ఇచ్చాయి.
ఒకట కాదు రెండు అనేక ప్రాంతీయ పార్టీలకు ఆ తర్వాత పీకే స్ట్రాటజిస్టు అయ్యాడు. ఆయనకు బీజేపీతో కాంట్రాక్టు ముగిసిపోయింది. ఆ తర్వాత మమతా బెనర్జీ, వైఎస్ జగన్, స్టాలిన్ వంటి వారి కోసం పీకే పని చేశాడు. కాంగ్రెస్ పార్టీ కోసం కూడా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో పని చేశాడు, యూపీలో అఖిలేష్ కోసం పని చేశాడు! మోడీ తర్వాత పీకే పని చేసిన వారిలో అధికారం చేపట్టిన వారు మమతా బెనర్జీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకే స్టాలిన్ ఉంటారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒకసారి, అనేక రాష్ట్రాల్లో పీకేను నమ్ముకున్నా కాంగ్రెస్ విషయంలో ఇతడి చేయి తిరలేదు! మరి మోడీని గెలిపించిన పీకే కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించలేకపోయాడనేది శేష ప్రశ్న! మమతా బెనర్జీ, జగన్, స్టాలిన్ లు ఆయా రాష్ట్రాల పరిస్థితులను అనుసరించి విజయం సాధించారు కానీ, పీకే వల్ల కాదనేది కూడా బహిరంగ సత్యం!
మోడీ విజయంలోనే పీకే పాత్రను అతిశయోక్తి. అప్పటికి పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పెల్లుబికిన వ్యతిరేకత, కాంగ్రెస్ అతిగా మైనారిటీల రాజకీయాలు చేయడం, అవినీతి ఆరోపణలు, దేశంలో గుప్పుమన్న హిందుత్వవాదం వంటివి మోడీ విజయానికి కారణం! మరి కాంగ్రెస్ విషయంలో బీజేపీ పై ఎలాంటి నెగిటివ్ ప్రోపగండాను కూడా పీకే సృష్టించలేకపోయాడే! కాంగ్రెస్ విషయంలో ఇతడి ఆటలు ఎందుకు సాగలేదు! కనీసం రెండు మూడు రాష్ట్రాల్లో అయినా ఇతడు ఎందుకు కాంగ్రెస్ ను గెలిపించలేకపోయాడు? అయితే పీకే వల్ల పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక వ్యాపారంగా మారింది.
ఇతడి దగ్గర పని చేసిన వాళ్లు సొంత దుకాణాలు పెట్టుకున్నారు. ఐప్యాక్ ఇతడితో వేరయ్యింది. అది వేరే సంస్థగా కొనసాగుతూ ఉంది. రాజకీయ పార్టీలు సొంత వ్యవస్థలను నమ్ముకోవడంతో పాటు ఇలాంటి స్ట్రాటజీ సంస్థలను నమ్ముకోవడం కొనసాగుతూ ఉంది. 2014 ఎన్నికల్లో తనను గెలిపించాడనే ఫీలింగ్స్ ఏవీ మోడీకి పీకే విషయంలో లేవు! అందుకే 2019 ఎన్నికల నాటికి మోడీ కూడా ఆయనను పట్టించుకోలేదు!
ఇక జగన్ కు కూడా అలాంటి అభిప్రాయాలు లేవు, అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు జగన్ చేదయ్యాడు! మరి దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలో ఉన్న వేళ పీకే ఏం చేస్తున్నాడంటే.. ఇప్పుడు ఆయన చిలక జోస్యాలను చెబుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది! ఏపీకి వెళ్లి చంద్రబాబును కలిసి జగన్ ఓడిపోతున్నాడంటూ పలికాడు! ఇంకా రకరకాల రాజకీయ జోస్యాలు చెబుతున్నాడు. మరి ఏ బేస్ మీద ఆయన ఇలాంటి జోస్యాలు చెబుతున్నాడో ఆయన చెప్పడం లేదు!
గతంలో తనకు ఐప్యాక్ అనే సంస్థ ఉండేది. అది సర్వేలు చేయించుకునేదో, అధ్యయనాలు చేసేదో, పొలిటికల్ స్ట్రాటజీలు క్రియేట్ చేసేదో ఒకటి చెప్పుకోవడానికి ఉండేది! మరి అలాంటిది సంస్థతో ఆయనకు ఇప్పుడు సంబంధం లేదట! ఆయన దగ్గర గతంలో పని చేసిన వారు సొంత దుకాణాలు పెట్టుకున్నారు! వారి వ్యాపారాలు వాళ్లవి! మరి ఇప్పుడు పీకే ఒట్టి చిలక జోస్యం చెప్పే వాడిలా మాట్లాడుతూ ఉండటం గమనార్హం!
అయితే ఇలాంటి జోస్యగాళ్లు కూడా తెరమరుగు కావడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు! ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ గతంలో చెప్పిన జోస్యాలు తప్పు అయిన వాటి గురించి మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల విషయంలో పీకే చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఆయన ఎవరైతే గెలుస్తారన్నారో వారు ఓటమి పాలయ్యారు! అలా పీకే పరిస్థితి చిలక జోస్యంలా మరింది. గత ఎన్నికల ముందు లగడపాటి రాజగోపాల్ ఇలాగే హడావుడి చేశాడు! తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కుతుందంటూ ఆంధ్రా అక్టోపస్ గా ముద్ర వేయించుకున్న రాజగోపాల్ ఆ తర్వాత తెరమరుగు అయ్యాడు. ఇక ఏపీ విషయంలో రవి ప్రకాష్ కూడా తన జోస్యం ఒకటి చెప్పాడు.
టీవీ9 పరిణామాలతో జగన్ పై శత్రుత్వాన్ని పెంచుకున్నాడో ఏమో కానీ.. రవి ప్రకాష్ కూడా జగన్ కు వ్యతిరేకంగా పోలింగ్ కు ముందు ఒక సర్వేఅంటూ వదిలాడు! తమ రాగద్వేషాలే తప్ప వీరి జోస్యాల్లో సాంకేతికత, వాస్తవికత ఎక్కడా కనిపించడం లేదు! అయితే వీరు చెప్పేవి అభాసుపాలైతే వీరికే డ్యామేజ్! అయినప్పటికీ వీరికేం భయం లేదు! పీకే జోస్యాలు ఇప్పటికే చాలా సార్లు అబద్ధాలైనా, అతడు ఏదో రకంగా చెల్లుబాటు అవుతున్నాడు. ఆ తీరే వీరికి ధైర్యం! కానీ రోజులు మారాయి. లగడపాటి మారుమాట్లాడలేక తెరమరుగు అయినట్టుగా తేడా వస్తే పీకేకు, రవి ప్రకాష్ కూ అదే గతి తప్పకపోవచ్చు!