కూటమి గెలిస్తే ఎమ్మెల్యేలు చాలా మందేనా?

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి తరఫున జనసేన అభ్యర్ధిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్ధిత్వం పట్ల మొదట్లో మూడు పార్టీలలో కొంత వ్యతిరేకత కనిపించినా…

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి తరఫున జనసేన అభ్యర్ధిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్ధిత్వం పట్ల మొదట్లో మూడు పార్టీలలో కొంత వ్యతిరేకత కనిపించినా వైసీపీ మీద కోపంతో అంతా ఒక్కటిగా పనిచేయడం అనివార్యం అయింది.

అంతే కాదు కొణతాల గెలిస్తే తాము కూడా చక్రం తిప్పవచ్చు అన్న మరో ఆలోచన కూడా ఇలా చేసింది అని అంటున్నారు. కొణతాల గెలిస్తే మాజీ ఎమ్మెల్యే ఆయన వియ్యంకుడు టీడీపీ సీనియర్ నేత పీలా గోవింద సత్యనారాయణ హవా చాటుకుంటారని అంటున్నారు. ఆయన ఆధిపత్యం చూపించే అవకాశాలు మెండు అంటున్నారు.

మరో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇటీవల మళ్లీ టీడీపీలో చేరారు. ఆయన కొణతాలతో దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి చేతులు కలిపారు. తన కుమారుడిని వచ్చే ఎన్నికల నాటికి అయినా ఎమ్మెల్యే అభ్యర్ధిగా చూడాలనుకుంటున్నారు. కొణతాల విజయం సాధిస్తే దాడి ఫ్యామిలీ కూడా రాజకీయంగా తమ సత్తాను చాటేందుకు ప్రయత్నించవచ్చు అని అంటున్నారు.

అలాగే మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు టీడీపీలో సీనియర్ నేత. టికెట్ ఆశించి భంగపడిన వారు. ఆయన సైతం తన జోరు చూపించవచ్చు అంటున్నారు. జనసేన నుంచి బీజేపీలోకి వెళ్ళిన పరుచూరి భాస్కరరావుతో పాటు చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వీరంతా ఉమ్మడిగా సహకరించారు. దాంతో ఎవరికి వారుగా తామే కీలకం అని వ్యవహరించడం ఖాయమని అంటున్నారు. అందుకే వైసీపీ గెలిస్తే ఒక్కరే ఎమ్మెల్యే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అనకాపల్లి ఓటర్లు ఎవరిని ఎన్నుకున్నారు అన్నది జూన్ 4న ఫలితం తేల్చనుంది.