పాపం షర్మిల.. ఎందుకలా మాట్లాడుతోందో?

మొన్నటిదాకా అంటే.. ఏదో కడప ఎంపీగా నెగ్గగలనేమో అనే ఆశతో,  లేదా, కాంగ్రెసు పార్టీకి ఒక్క శాతం ఓటు బ్యాంకునైనా పెంచితే రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని అత్యాశతోనో మొత్తానికి  వైఎస్ షర్మిల చాలా కష్టపడ్డారు.…

మొన్నటిదాకా అంటే.. ఏదో కడప ఎంపీగా నెగ్గగలనేమో అనే ఆశతో,  లేదా, కాంగ్రెసు పార్టీకి ఒక్క శాతం ఓటు బ్యాంకునైనా పెంచితే రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని అత్యాశతోనో మొత్తానికి  వైఎస్ షర్మిల చాలా కష్టపడ్డారు. మామూలుగా అయితే ట్వీట్ రాజకీయంలో ఆమె పులి అనే సంగతి అందరికీ తెలుసు.

తెలంగాణలో కొన్నాళ్లు నడిపిన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేసిన తర్వాత.. కేసీఆర్ సర్కారు మీద ట్వీట్లలో విరుచుకుపడుతూ ఆమె తన పోరాటపటిమ ప్రదర్శించారు. ఏపీలో కాస్త ఫీల్డు మీద తిరిగారు. ఎన్నికలు పూర్తయిపోయాక.. ఇప్పుడు మళ్లీ ట్విటర్ నే పట్టుకుని.. జగన్మోహన్ రెడ్డి మీద సందర్భశుద్ధిలేని విమర్శలు చేస్తున్నారు. ఆ ట్వీట్లు చూసిన వారికి మాత్రం అయ్యోపాపం షర్మిల.. ఆమెకు ఏమైందో కదా అనుకుంటున్నారు.

జగన్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందనేది ఆమె తాజా ట్వీట్ ఆరోపణ. ఇప్పుడు ఆ మాట ఎందుకు ఆమెకు గుర్తుకు వచ్చిందో తెలియదు. లండన్ వీధుల్లో విహరిస్తున్న జగన్ కు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు అని కూడా నిందిస్తున్నారు. ఏ కాంటెక్ట్స్ లో ఈ నిందలు వేస్తున్నారో మాత్రం తెలియదు.

నిజానికి, జగన్ లండన్ వీధుల్లో విహరించడం సంగతి సరే.. జగన్ ను ఓడించడానికి ముఠాలు కట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల అందరూ అమెరికాలోనే విహరిస్తున్నారు. తన విహారాల గురించి ఎవరికీ తెలియదనుకున్నారో ఏమో గానీ.. జగన్ గురించి షర్మిల ట్వీట్లు పెట్టడం విశేషం. 

సోషల్ మీడియాకు హద్దుండదు గనుక.. షర్మిల గురించి రకరకాల పుకార్లు వస్తున్నాయి. అన్నతో పోటీపడలేక.. మళ్లీ రాజీకి విదేశాలలో ప్రయత్నాలు సాగిస్తున్నదని సోషల్ మీడియా కామెంట్లు చేస్తోంది. ఎందుకంటే.. పార్టీనే విలీనం చేసిన షర్మిల ఎన్ని మెట్లయినా మళ్లీ మళ్లీ దిగగలదనే ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ను తిడితే తప్ప.. తనకు చెడ్డపేరు తొలగిపోదనే ఆలోచనతో ఇలా అర్థంపర్థంలేని విమర్శలు ట్విటర్లో సాగిస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు.