తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే అని తెలుగులో ఓ సామెత ఉంది. పేకాట కావొచ్చు, మరో ఆట కావొచ్చు అక్కడ బంధుత్వాలు పనికిరావని అర్థం. ఆటను ఆట మాదిరిగానే చూడాలి. బంధుత్వాన్ని బంధుత్వం మాదిరిగానే చూడాలి. ఈ సూత్రం రాజకీయ రంగంలోనూ వర్తిస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది.
ఈసీ పర్మిషన్ తో, కొన్ని ఆంక్షలతో కేబినెట్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. కేబినెట్ లో చర్చించిన మిగతా విషయాలు అలా పక్కనుంచితే, జనంలో చర్చనీయాంశమైన, ఆసక్తికరమైన అంశం ఒకటుంది. జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవం కదా. రేవంత్ సర్కారుకు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. కాబట్టి ధూమ్ ధామ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసింది.
కానీ దురదృష్టవశాత్తు కోడ్ అమల్లో ఉండగా ఈ ఉత్సవం వచ్చింది. కేబినెట్ సమావేశానికి పర్మిషన్ అడిగినట్లే అవతరణ దినోత్సవం నిర్వహణకూ ఈసీని పర్మిషన్ అడగాలి. ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి ఎలాగూ పర్మిషన్ అడుగుతారు. ఈసీ కూడా కాదనదు. కొన్ని ఆంక్షలతో పర్మిషన్ ఇస్తుంది. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేలమందితో చేయాలని ప్రభుత్వం అనుకుంది. తెలంగాణ వచ్చిన పదేళ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ అధికారం దక్కించుకొని పదేళ్లు పాలించాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయ్యుండొచ్చు. కానీ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వారిని కూడా, ప్రాణాలు పోగొట్టుకున్న వారి అంటే అమరుల కుటుంబాలను కూడా గౌరవించాలి కదా. అందుకే వాళ్లకూ సన్మానం చేస్తారు.
వేలాదిమంది ఉద్యమించినా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా కేసీఆర్ కు పేరు వచ్చేసింది. పేరు వచ్చింది అనడంకంటే దాన్ని ఆయన హైజాక్ చేశాడనడం సబబుగా ఉంటుంది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ కొన్ని వందసార్లు చెప్పుకున్నాడు. ఇది విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనూ హైలెట్ చేశాడు. ఊళ్ళల్లో పాలేరుల్లో పెద్ద పాలేరులు ఉన్నట్లుగా ఉద్యమకారుల్లో ఈయన్ని పెద్ద ఉద్యమకారుడని చెప్పాలి. ఆనాడు ఆయన చేసిన నిరాహార దీక్ష మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయనుకోండి. అది వేరే సంగతి.
సరే … ఇప్పుడు విషయమేమిటంటే అవతరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు కేసీఆర్ కు కూడా సన్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకూ ఆహ్వానం పంపుతారు. కేసీఆర్ కనుక వస్తే సోనియాతో ఆయన వేదిక పంచుకోవలసి ఉంటుంది. సోనియా తెలంగాణ ఇచ్చినా ఆమె అంటే ఆయనకు పడదు. రేవంత్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిలా కాకుండా, రాజకీయ శత్రువుగా చూస్తాడు. వ్యక్తిగతంగా ద్వేషిస్తాడు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను అలాగే చూస్తాడనుకోండి.
కేసీఆర్ ను గౌరవించాల్సిన సందర్భంలో గౌరవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సన్మానం చేయాలనుకున్నాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే కేసీఆర్ బాత్రూంలో జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నాడు. ఆస్పత్రిలో చేరాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాడు. మంచి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించాడు. అంటే రాజధర్మం నెరవేరుస్తున్నట్లే భావించాలి. మరి కేసీఆర్ అవతరణ దినోత్సవానికి వస్తాడా? సన్మానం స్వీకరిస్తాడా? అహంకారంతో బిగదీసుకొని ఇంట్లోనే ఉంటాడా?