ఈ ఎన్నికలు పల్నాడు పాలిట శాపమయ్యాయి. మళ్లీ గొడవలు పురివిప్పాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలతో ఆడుకుంటున్నారు. నాయకుల ఆగడాలకు పోలీస్ యంత్రాంగం వంతపాడుతోంది. తమకు అనుకూలమైన పోలీస్ బాస్‌లు వస్తే… ప్రత్యర్థులపై రాజకీయంగా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.
పల్నాడు ఎస్పీగా బిందుమాధవ్ బాధ్యతలు తీసుకోగానే టీడీపీ నేతల్లో ఉత్సాహం కనిపించింది. టీడీపీకి పల్నాడు పోలీస్ బాస్ వత్తాసు పలకడం వల్లే హింసకు దారి తీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాచర్ల సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెచ్చగొట్టేలా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
పల్నాడులో ఘర్షణ వాతావరణానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు పిన్నెల్లి బ్రదర్స్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. కానీ జూలకంటి మాత్రం ఎలాగైనా రచ్చ పెట్టుకోవాలని తహతహలాడుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పిన్నెల్లి బ్రదర్స్‌ను తాలిబన్లతో జూలకంటి పోల్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరుండి ఈవీఎంలు ధ్వంసం చేయించారని ఆయన ఆరోపించారు.
మాచర్లలో చోటు చేసుకున్న ఘర్షణలు, అలాగే అవినీతిపై సిటింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధమని, మీరు సిద్ధమా? అంటూ పిన్నెల్లికి ఆయన సవాల్ విసిరారు. భయపెడితే భయపడడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరని పిన్నెల్లిని కవ్వించేలా జూలకంంటి మాట్లాడారు.
పిన్నెల్లి సోదరులకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, అసలు దాని గురించి తెలియదని జూలకంటి తన మార్క్ విమర్శలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. మాచర్ల మీ తాత జాగీరు కాదని తీవ్రంగా బ్రహ్మారెడ్డి హెచ్చరించడం గమనార్హం. నాయకుల మాటలే మాచర్లలో మంటలు రేపుతున్నాయి. పిన్నెల్లి బ్రదర్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.