జనసేన ఉత్తరాంధ్రలో ఈసారి పొత్తులో అయినా మూడు ఉమ్మడి జిల్లాలలో తన ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ సౌత్, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి అసెంబ్లీ సీట్లకు గాజు గ్లాస్ పోటీ చేసింది. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల సీటు, ఉమ్మడి శ్రీకాకుళంలో పాలకొండ అసెంబ్లీ సీటుకు పోటీ చేసింది.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే ఆరవ వంతు సీట్లకు జనసేన పోటీపడింది. ఇందులో జనసేన కనీసంగా అయిదు సీట్లను గెలుచుకుంటామని లెక్కలు వేసుకుంటోంది. ఉమ్మడి విశాఖలో నాలుగు విజయనగరం లోని నెల్లిమర్ల సీట్లు ఎటు నుంచి ఏమి జరిగినా గాజు గ్లాస్ లోకే వచ్చి పడతాయని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.
ఎందుకో పాలకొండ విషయంలో కొంత డౌట్ పడుతోంది అంటున్నారు. పాలకొండ ఎస్టీ సీటుగా ఉంది. ఇక్కడ రెండు సార్లు వరసగా వైసీపీ విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతోంది. మిగిలిన చోట్ల చూస్తే వైసీపీ ఇప్పటికి ఒక్కసారే గెలవడం పైపెచ్చు అవి టీడీపీకి జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ కలిగినవిగా ఉండడంతో వైసీపీని ఓడించి మరీ సీట్లు పట్టుకెళ్తామని జనసేన భావిస్తోంది.
అలా ఉత్తరాంధ్రలో ఆరింట అయిదు సీట్లు గెలవడం అంటే 84 శాతం ఫలితాన్ని సాధించినట్లే అని అంటున్నారు. ఈ సీట్లలో నాలుగింట జనసేనకు అండగా నిలిచే బలమైన సామాజిక వర్గం మద్దతు కూడా ఉండడంతో గాజు గ్లాస్ పార్టీ ఈ సీట్ల మీద ఆశలు ఎక్కువగా పెట్టుకుందని అంటున్నారు.
అయితే ఈ సీట్ల విషయంలో వైసీపీ కూడా గట్టిగానే పట్టు మీద ఉంది. ఇందులో తామూ గెలిచి చూపిస్తామని అంటోంది. ఓట్ల బదిలీ సరిగ్గా సాగలేదని అందువల్ల వైసీపీని ఓడించడానికి జనసేన బలం ఏ మాత్రం సరిపోదు అని ఆ పార్టీ వాదనగా ఉంది. ఎవరిది నిజం అన్నది జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలు తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంది.