మీడియా ప్రతినిధులు వచ్చి తమను పలకరించే పాటి సెలబ్రిటీ హోదా ఉంటే చాలు.. ఈ రోజుల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేస్తున్నారు. ప్రజలలో మెలగడం మరచిపోయిన వాళ్ళు, ప్రజల నాడిని గ్రహించే పట్టు కోల్పోయిన వాళ్ళు.. ప్రజలతో మమేకం కావడం అనే లక్షణాన్ని విస్మరించిన వాళ్ళు.. అన్ని రకాల వారు కూడా తమ తమ మనోభీష్టానికి అనుగుణంగా రాజకీయ జోస్యం చెప్పుకుంటూ మనుగడ సాగిస్తున్నారు.
ఆ క్రమంలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగిన చింతా మోహన్ కూడా తనకు తోచిన జోస్యం చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ గూటికి చెందిన ఈ చిలక చెబుతున్న జోస్యం కొంచెం చిత్రంగా కనిపిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు భారీ విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నారట. ఈపాటి జోస్యం ఆయన మీద భక్తి, జగన్ మీద ద్వేషం ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతున్నారు కదా! ప్రత్యేకంగా చింతా వారి జోస్యం గురించి పట్టించుకోవాల్సింది ఏముంది అని మీకు అనిపించవచ్చు. అక్కడే ఆయన ఒక మెలిక పెడుతున్నారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశానికి దక్కే సీట్ల సంఖ్య తగ్గబోతున్నదట. మోడీతో పొత్తు లేకుండా ఉంటే గనుక.. మరింత బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉండేవారట.
ఇలాంటి వెరైటీ జోస్యాన్ని చింతామోహన్ వినిపిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరి పట్ల కూడా వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించిందట. మామూలుగా చంద్రబాబు నాయుడు 150కి మించి సీట్లు సాధించి ఉండేవాళ్ళు గాని, బిజెపితో పొత్తు వలన సీట్ల సంఖ్య తగ్గినా అధికారంలోకి మాత్రం తప్పకుండా వస్తారు అని చెప్తున్నారు చింతా మోహన్.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఇంతకంటే భిన్నంగా మాట్లాడతారని అనుకోవడం దండగ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల దగ్గర నుంచి వారందరికీ చంద్రబాబు నాయుడు ఫండింగ్ చేశారని పుకార్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు సొమ్ము పుచ్చుకొని ఆయన గెలుస్తారని చెప్పకుండా మరెవరు గెలుస్తారని చెబుతారు.. అని ప్రజలు భావిస్తున్నారు.