బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. దీన్ని బర్త్ డే పార్టీ పేరుతో నిర్వహించడం గమనార్హం. పోలీసుల దాడిలో పలువురు ప్రముఖులు పట్టుబడినట్టు తెలిసింది. అలాగే అత్యంత ఖరీదైన కార్లు దొరికాయి. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో స్టిక్కర్ అంటించిన కారు దొరకడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో వార్తల్లో ప్రముఖంగా తన పేరు చర్చనీయాంశం కావడంపై మంత్రి కాకాణి స్పందించారు. అసలు ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినలా? లేదా ఫొటో కాపీనా? అనే విషయాన్ని పోలీసులు తేల్చాలని ఆయన కోరారు. 2023తోనే ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసిందని ఆయన తెలిపారు.
కాకాణికి సంబంధించిన కారు అక్కడుందనే వార్త టీడీపీ, ఎల్లో మీడియాకు పండుగ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. అసలే సర్వేపల్లిలో కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరప్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. గత రెండు ఎన్నికల్లో కాకాణి చేతిలో సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు. ఈ దఫా సోమిరెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయినప్పటికీ గెలవలేరనే టాక్ వినిపిస్తోంది. తాజాగా రేవ్ పార్టీ అంశం కాకాణిని ఇరిటేట్ చేయడానికి సోమిరెడ్డికి ఉపయోగపడుతుంది.