ఉన్నట్టుండి రక్షణ అనే సినిమాతో తెరపైకొచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. సడెన్ గా ఈ సినిమా ఎక్కడ్నుంచి వచ్చింది. పాయల్ ఎప్పుడు ఈ సినిమా చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
నిజానికి ఇది కొత్త సినిమా కాదు. దాదాపు నాలుగేళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకొని, ఫస్ట్ కాపీతో సిద్ధమైన చిత్రం. అప్పుడు ఆ సినిమాకు 5డబ్ల్యూస్ (5 W’s) అనే పేరు పెట్టారు. కానీ మార్కెట్ చేయలేక వాయిదా వేస్తూ వచ్చారు. ఒక దశలో నేరుగా ఓటీటీలో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, అది కూడా సాధ్యం కాలేదు.
ఇప్పుడు అదే సినిమాకు పేరు మార్చారు. రక్షణ టైటిల్ తో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా జరగడం కొత్తేం కాదు. కాకపోతే ఈ సినిమా విషయంలో చిన్న వివాదం ఉంది.
ఈ విషయాలన్నింటినీ స్వయంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బయటపెట్టింది. అంతేకాదు, ఈ విషయంలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా బయటపెట్టింది.
ఈ సినిమాకు సంబంధించి పాయల్ కు ఇంకా కొంత పేమెంట్ పెండింగ్ పెట్టారట నిర్మాతలు. ఆ డబ్బు ఇవ్వకుండానే, ప్రచారానికి రమ్మని బలవంతం చేస్తున్నారట. ప్రస్తుతం తన కాల్షీట్లు అందుబాటులో లేవని చెప్పడంతో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట.
బ్యాలెన్స్ ఎమౌంట్ ఇస్తే డిజిటల్ ప్రమోషన్ చేయడానికి సిద్ధమని చెప్పినప్పటికీ అంగీకరించడం లేదంట. టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారట. ఈ విషయాలన్నింటినీ బయటపెట్టి తనకు న్యాయం చేయాలని కోరుతోంది పాయల్.